Bengaluru: కర్ణాటక సీఎల్పీ భేటీ.. సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడేనా?

కర్ణాటకలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు.

Updated : 14 May 2023 18:42 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో విజయం సాధించిన కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసేందుకు సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తమ ప్రయత్నాలు మరింత ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. తమకు విధేయులైన ఎమ్మెల్యేలతో సిద్ధూ, డీకేఎస్‌ విడివిడిగా సమావేశం కావడం ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి గురువారం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

సీఎం ఎవరో నేడే ప్రకటిస్తారా?

మరోవైపు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా బెంగళూరులో భేటీ అయ్యారు. నూతన సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై వీరంతా చర్చించనున్నారు. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధినేతకు అప్పగిస్తూ తీర్మానం చేసే సంప్రదాయం కాంగ్రెస్‌లో ఉండటంతో ఈసారి కూడా అలాగే చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం ముగ్గురు నేతలతో కూడిన పరిశీలకుల బృందాన్ని బెంగళూరుకు పంపింది. ఇందులో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ శిందే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్‌, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్‌ బబారియా ఉన్నారు. ఈ బృందం ఎమ్మెల్యేల మనోగతాన్ని తెలుసుకొని వారి అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి అందజేస్తుందని కేసీ వేణుగోపాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం పేరును రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

గురువారం ప్రమాణస్వీకారం?

ఇంకోవైపు, కర్ణాటక కొత్త సీఎం, కేబినెట్‌ మంత్రులు గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు హాజరుకానున్నారు. అలాగే, భావసారుప్యత కలిగిన పార్టీలకు సైతం కాంగ్రెస్‌ ఆహ్వానాలు సైతం పంపిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక మంత్రివర్గం కూర్పునకు ఒకట్రెండు రోజుల్లో తుది రూపం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సీఎం అభ్యర్థి విషయంలో వివాదంలేదు: ఖర్గే

ఇదిలా ఉండగా, కర్ణాటకలో పరిణామాలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు.  కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కోసమే కాంగ్రెస్‌కు ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తామని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు పరిశీలకులను అధిష్ఠానం పంపిందని.. సీఎం అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో సరైన నిర్ణయమే తీసుకుంటామన్నారు. సీఎం అభ్యర్థి విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆయన స్పష్టంచేశారు. 

సీఎం పీఠం దక్కించుకొనేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హరిహరపుర మఠానికి చెందిన వక్కళిగ సాధువులు డీకేఎస్‌ ఇంటికి వచ్చి ఆయన్ను కలిశారు. మరోవైపు, తుముకూరులోని సిద్ధేశ్వర మఠాన్ని డీకేఎస్‌ కుటుంబ సమేతంగా సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. సీఎల్పీ భేటీకి ముందు మఠాన్ని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధరామయ్య ఖర్గే నివాసానికి వెళ్లి కలిశారు. అయితే, ఇది రాజకీయ సమావేశం కాదని ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే తెలిపారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని