Longest Ruling: రెండో దఫా విజయమే కష్టం.. మరీ వీళ్లు ఇన్నేళ్లు ఎలా గెలుస్తున్నారు?
దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. బెంగాల్, సిక్కిం, త్రిపుర మొదలు గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో మూడుకంటే ఎక్కువసార్లు గెలిచి సుదీర్ఘ పాలన అందిస్తున్నాయి.
దిల్లీ: దేశంలో సుదీర్ఘ కాలంపాటు అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతుండగా.. మరికొన్ని మాత్రం ఆయా రాష్ట్రాల్లో ఏళ్లపాటు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఐదేళ్లపాటు పాలించి మరోసారి అధికారంలోకి రావాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తోన్న తరుణంలో.. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాకుండా ప్రజావ్యతిరేకతను దాటుతూ అధికారాన్ని భద్రపరచుకుంటున్నాయి. ఇదివరకు త్రిపుర, సిక్కింలలో ఇటువంటి పరిణామం చూడగా.. తాజాగా గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ఈ తరహా రాజకీయం కొనసాగుతోంది. బెంగాల్‌ను 34ఏళ్ల పాటు సీపీఎం ఏకధాటిగా పాలించి రికార్డుకు గుజరాత్ భాజపా చేరువవుతోంది. ఇప్పటికే 27 ఏళ్లు గుజరాత్‌లో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ.. మరో ఐదేళ్ల పాలనకు మార్గం సుగమం చేసుకుంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడుకంటే ఎక్కువసార్లు అధికారం చేజిక్కించుకున్న కొన్ని రాష్ట్రాలను ఓసారి పరిశీలిస్తే..
గుజరాత్‌లో ఏడోసారి..
గుజరాత్‌లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అనాసక్తి నెలకొన్న వేళ.. కేశూభాయ్ పటేల్ నేతృత్వంలో 1995లో భాజపా తొలిసారి అధికారం చేపట్టింది. తొలినాళ్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆ పార్టీ తొలి రెండేళ్లలో రెండు సార్లు సీఎంలను (ఎనిమిది నెలలపాటు కేశూభాయ్ పటేల్, మరో 11 నెలలు సురేష్ మెహతా) మార్చింది. అనంతరం రాజకీయ పరిణామాలు మారిపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన(27 రోజులపాటు) కొనసాగింది. తర్వాత వచ్చిన రాష్ట్రీయ జనతా పార్టీ రెండేళ్లు(1996- 1998) పాలించినప్పటికీ సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించలేకపోయింది. ఈ క్రమంలో 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చిన భాజపా.. అప్పటినుంచి నేటివరకు వెనక్కి తిరిగి చూడలేదు.
మోదీ రాకతో నిలదొక్కుకొని..
2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. తనదైన వ్యూహాలతో గుజరాత్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఆ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో అల్లాడిపోయిన రాష్ట్ర పరిస్థితిని ఆయన చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వాటితోపాటు వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, విద్యుత్ రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్రంలో మోదీ ఛరిష్మా పెరిగిపోయింది. అలా గుజరాత్‌లో 2001లో మొదలైన భాజపా విజయ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగం, ధరల పెరుగుదలతోపాటు పలు జాతీయ అంశాలతో కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ భాజపా వ్యూహాల ముందు తలకిందులవుతోంది. ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన భాజపా.. మొత్తంగా ఏడుసార్లు గెలిచిన పార్టీగా నిలిచింది.
బెంగాల్‌లో అప్పుడు కమ్యూనిస్టులు.. ఇప్పుడు టీఎంసీ
1960, 70వ దశకంలో రాజకీయ అస్థిరతను ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్‌కు జ్యోతిబసు మార్గదర్శిగా నిలిచారు. 1977లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సుదీర్ఘ కాలం(23 ఏళ్లు) పాలించిన నేతగానూ రికార్డు సృష్టించారు. 2000లో బాధ్యతల నుంచి వైదొలిగిన ఆయనకు.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దానిని తిరస్కరించినట్లు సన్నిహితులు చెబుతారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బుద్ధదేవ్ భట్టాచార్య.. మరో పదేళ్లు అధికారాన్ని నిలబెట్టారు. మొత్తంగా బెంగాల్‌ను 34ఏళ్లపాటు పాలించి కమ్యూనిస్టులు రికార్డు నెలకొల్పారు. మూడు దశాబ్దాల పాలనలో ప్రజాఉద్యమాలతో రంగ ప్రవేశం చేశారు మమతా బెనర్జీ. ప్రజా వ్యతిరేకతను తనవైపు మలచుకున్న దీదీ.. కమ్యూనిస్టుల కంచుకోటకు గండికొడుతూ 2011లో ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లోనూ విపక్షాల విమర్శలు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ మూడోసారి ఘనవిజయం సాధించి బెంగాల్ బొబ్బిలిగా నిలబడ్డారు.
సిక్కింలో పీకే చామ్లింగ్
స్వతంత్ర భారత దేశంలో సుదీర్ఘకాలం పాటు ఓ రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ నిలిచింది. 1994లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పవన్ కుమార్ చామ్లింగ్.. వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. అభివృద్ధి, శాంతి వ్యూహాలతో ముందుకెళ్లిన ఆయన 24 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కనిపించినప్పటికీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. దేశంలో అత్యధిక కాలం ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగానూ చామ్లింగ్ నిలిచారు. అయితే, 2019 ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ పార్టీ విజయం సాధించడంతో పవన్ కుమార్ చామ్లింగ్ సీఎం పీఠానికి దూరమయ్యారు.
ఒడిశా బాద్‌షా..
ఒకే పార్టీ వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోన్న రాష్ట్రాల జాబితాలో ప్రస్తుతం ఒడిశా కూడా ఉంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన బిజూ జనతా దళ్(బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్.. ఇప్పటివరకు ఐదుసార్లు వరుసగా విజయం సాధించారు. 2000లో 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ ఇప్పటికీ విజయవంతమైన పాలన సాగిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం, వరుస తుపాన్లు, నిరక్షరాస్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఒడిశాను అభివృద్ధి పథంలో నడిపించడంలో నవీన్ పట్నాయక్ సఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
త్రిపురలో ‘నాలుగో’ మాణిక్యం
మరో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర కూడా రెండు దశాబ్దాలపాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచింది. 1978 నుంచి 1988 వరకు సీపీఎం తరఫున నృపెన్ చక్రవర్తి త్రిపుర సీఎంగా కొనసాగారు. తర్వాత ఓ దఫా కాంగ్రెస్ చేతికి అధికారం పోయింది. అనంతరం 1993లో మళ్లీ అధికారం చేపట్టిన సీపీఎం.. 23ఏళ్లు అధికారంలో కొనసాగింది. ఇందులో 1998 నుంచి 2018 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో మాణిక్ సర్కార్ విజయం సాధించారు. ఆయన మొత్తంగా 20 ఏళ్లు సీఎం పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2018 ఎన్నికల్లో త్రిపుర సీఎం పీఠాన్ని భాజపా చేజిక్కించుకొని 2022లో రెండోసారి విజయం సాధించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ఇయాన్ హీలీ ‘పిచ్’ వ్యాఖ్యలకు జాన్ రైట్ కౌంటర్..
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు