Oppositon Meet: భాజపాపై కుటుంబంలా కలిసి పోరాడుతాం: మమత

భాజపాపై ప్రతిపక్ష పార్టీలన్ని కలికట్టుగా ఒక కుటుంబంలా పోరాటం చేస్తాయని పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల సమావేశం కోసం మమత పట్నాకు చేరుకున్నారు.

Published : 23 Jun 2023 01:55 IST

పట్నా: ప్రతిపక్ష పార్టీలు (Opposition Parties) ఒక కుటుంబంలా కలికట్టుగా భాజపా (BJP)పై పోరాటం చేస్తాయనే నమ్మకం తనకు ఉందని పశ్చిమబెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. శుక్రవారం జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం కోసం గురువారం సాయంత్రం మమత పట్నాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav)ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పశ్చిమబెంగాల్‌లో వామపక్ష పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు గురించి, కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వకుంటే.. ప్రతిపక్ష పార్టీల భేటీకి హాజరు కాబోమని కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ విధించిన అల్టిమేటం గురించి మాట్లాడారు. ‘‘రేపు సమావేశంలో ఏం జరుగుతుందని నేను చెప్పలేను. కానీ, భాజపాకు వ్యతిరేకంగా ఒక కుటుంబంలా పోరాటం చేసేందుకు మేమంతా ఇక్కడ సమావేశం అవుతున్నాం’’ అని మమత చెప్పారు. 

ప్రస్తుతం లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని మమత తెలిపారు. దేశాన్ని కాపాడాలంటే భాజపాను ఓడించాలన్న మమత, మణిపూర్‌లో హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో శనివారం జరగబోయే అఖిలపక్ష భేటీకి హాజరుకావడంలేదని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓటమి లక్ష్యంగా సుమారు 20 ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు, సీఎంలు శుక్రవారం పట్నాలో భేటీ అవుతున్నారు. బిహార్‌ సీంఎ నీతీశ్‌  కుమార్ ఈ భేటీని ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్‌ సహా వివిధ రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు, సీఎంలతో సమావేశమైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని