Mayawati: మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ తొలగింపు

Mayawati: డిసెంబర్‌లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్‌ ఆనంద్‌ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Published : 08 May 2024 08:02 IST

లఖ్‌నవూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను (Akash Anand) తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. భాజపాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఇటీవల ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆయన పూర్తిస్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. 

‘‘బీఎస్పీ (BSP) ఒక పార్టీ మాత్రమే కాదు. ఆత్మగౌరవం, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపు. కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దానికోసమే అంకితం చేశాం. కొత్తతరాన్ని కూడా అందుకు సిద్ధం చేస్తున్నాం. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్‌ ఆనంద్‌ను (Akash Anand) జాతీయ సమన్వయకర్తగా, ఉత్తరాధికారిగా ప్రకటించాం. అయితే పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పూర్తి పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నాం. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్‌ కుమార్‌ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు’’ అని మాయావతి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్‌ మాట్లాడుతూ యూపీలోని భాజపా ప్రభుత్వాన్ని బుల్డోజర్‌ గవర్నమెంట్‌గా అభివర్ణించారు. యువతను ఆకలితో ఉంచుతూ.. పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులు నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. అదే సమయంలో ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తర్వాత ఆయన ర్యాలీలన్నింటినీ బీఎస్పీ రద్దు చేసింది. 

మాయావతి (Mayawati) తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను డిసెంబరులో ప్రకటించారు. ఆయన మాయావతి తమ్ముడి కుమారుడు. లండన్‌లో ఎంబీఏ చేశారు. 2017లో బీఎస్పీలో చేరిన ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు