BJP: కేసీఆర్.. ఇంకెంత దోచుకుంటావ్.. ఇంకెన్ని తింటావ్?: సాధ్వీ నిరంజన్‌ జ్యోతి

తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ

Updated : 22 Sep 2022 22:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి అన్నారు. రాష్ట్ర ప్రజలను తెరాస ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. ఈమేరకు హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేటలో భాజపా నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆమె మాట్లాడారు. ‘‘తెలంగాణలో ప్రయాగ్‌ రాజ్‌ను చూస్తున్నా. 10ఏళ్ల ముందు భారీ హిందు సమ్మేళనం నిర్వహించారు. అప్పుడు నేను హైదరాబాద్‌కు వచ్చాను. రంగారెడ్డి జిల్లాలో బస చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి సాధించలేదు’’ అన్నారు.

‘‘యూపీలో ప్రజలను దోచుకున్న నేతల ఇళ్లపైకి యోగి ఆదిత్యనాథ్‌ బుల్డోజర్లు ప్రయోగించారు. ఇక మరో నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్‌, రాహుల్‌ గాంధీ, బెంగాల్‌, బిహార్‌, భాజపాయేతర సీఎంలు ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు. 2014కు ముందు హైదరాబాద్‌లో  ప్రజలకు భద్రత ఎక్కడుంది? ఎప్పుడు బాంబు దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగాయా? మీకు ఇలాంటి ప్రభుత్వం కావాలా? అవినీతిపరుల ప్రభుత్వం కావాలా? కేసీఆర్‌ ఏం చెప్పారు? ఏం హామీలిచ్చారు? పేదలకు ఇళ్లు ఇచ్చారా? అలాంటి సీఎంపై ఎలాంటి భాషను ప్రయోగించారో మీరే చెప్పండి. పేదలకు కేంద్రం అందించే రేషన్‌ను అడ్డుకున్న ప్రభుత్వం కేసీఆర్‌ది. ఆ డబ్బులన్నీ కేసీఆర్‌ దోచుకున్నారు. కేసీఆర్.. ఇంకెంత దోచుకుంటావ్.. ఇంకెన్ని తింటావ్? ప్రభుత్వ ఉన్నది నీ కుటుంబం బాగు కోసమా? ప్రజల బాగు కోసమా? గ్రామపంచాయతీలకు డబ్బులు వెళ్లకుండా అడ్డుకొని వాటినీ దోచుకుంటున్నారు’’ అని సాధ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నంగా మారుస్తాం: సంజయ్‌

ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలి. దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్‌ మోసం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని భాజపా పార్లమెంట్‌లో పెట్టింది. అంబేడ్కర్‌ చరిత్రను తెలియజెప్పేలా పంచ తీర్థాలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని కేసీఆర్‌గుర్తు పెట్టుకోవాలి. మేం అధికారంలోకి వచ్చాక ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నంగా మారుస్తాం.’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. 
 

కేసీఆర్‌ మనవడిని కూడా రాజ్యసభకు పంపేవారు.. కానీ..: లక్ష్మణ్‌

‘‘ట్విటర్‌ పిట్ట కేటీఆర్‌ చిలక పలుకులు పలుకుతున్నారు. యూపీలోని యోగి ప్రభుత్వం రూ.లక్షల కోట్లతో రైతు రుణమాఫీ చేసింది. కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ పదవులే. కేసీఆర్‌ మనవడికి వయస్సు లేదు.. లేకపోతే రాజ్యసభ సభ్యుడిని చేసేవారు. వరుణుడి కరుణతో తెలంగాణలో పంటలు బాగా పండాయి. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలేదు. హైదరాబాద్‌ వనరులు తనఖాపెట్టి అప్పులు తెచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్‌లాగే మునుగోడులో కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలి’’ అని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

‘వేర్‌ ఈజ్‌ రాజాసింగ్‌’ ప్లకార్డులతో నినాదాలు

నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతిని బండి సంజయ్‌ సన్మానించారు. ఈ సభలో ‘వేర్‌ ఈజ్‌ రాజాసింగ్‌’ అంటూ ప్లకార్డులు పట్టుకొని కొందరు భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. లక్ష్మణ్‌ మాట్లాడుతుండగా రాజాసింగ్‌ అంటూ భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బండి సంజయ్‌ జోక్యం చేసుకొని కార్యకర్తల్ని సముదాయించారు. అనంతరం లక్ష్మణ్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts