Rahul Gandhi: అప్పుడు రాష్ట్రంలో చేసిందే ఇప్పుడు దేశంలో చేస్తున్నారు! మోదీపై రాహుల్‌ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ రెండు భారతదేశాలను సృష్టించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఒకటి ధనవంతులకు, మరొకటి పేదల కోసమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలోని వనరులను కొంతమంది సంపన్నులకు ధారాదత్తం...

Published : 11 May 2022 01:50 IST

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ రెండు భారతదేశాలను సృష్టించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఒకటి ధనవంతులకు, మరొకటి పేదల కోసమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలోని వనరులను కొంతమంది సంపన్నులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పార్టీ ప్రచారానికి శ్రీకారం చుడుతూ మంగళవారం దాహోద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ‘ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ’ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.

‘2014లో మోదీ ప్రధాని అయ్యారు. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రంలో చేసిందే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అదే ‘గుజరాత్ మోడల్’ను అమలు చేయడం. ఈ క్రమంలో రెండు భారత్‌లను సృష్టిస్తున్నారు. ఒకటి ధనవంతులది. ఇందులో అధికారం, డబ్బున్న బ్యూరోక్రాట్లు, బిలియనీర్లు ఉన్నారు. రెండోది.. సామాన్య ప్రజలకు చెందినది' అని అన్నారు. భాజపా మోడల్‌లో.. గిరిజనులు, పేదలకు చెందిన భూమి, అటవీ, నీటి వనరులను కొందరికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ.. ఈ విభజనను కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వం గిరిజనుల హక్కులను హరించిందని విమర్శించారు.

‘గిరిజనులు తమ కష్టార్జితంతో గుజరాత్‌లో రోడ్లు, వంతెనలు, భవనాలు, మౌలిక వసతులు నిర్మించారు. కానీ.. వారికి నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు.. ఏదీ దక్కలేదు. భాజపా ప్రభుత్వం ఏం ఇవ్వదు. కానీ.. ప్రతిదీ లాక్కుంటుంది. కాబట్టి.. మీ హక్కులను మీరే సాధించుకోవాలి’ అని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా నిర్వహణలో వైఫల్యాలపైనా మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘కొవిడ్‌ సమయంలో.. గుజరాత్‌లో ఒకవైపు మూడు లక్షల మంది మరణించగా.. మరోవైపు చప్పట్లు కొట్టాలని, మొబైల్ టార్చ్‌ను ఫ్లాష్ చేయాలని పిలుపునివ్వడం గమనార్హం. మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 50 నుంచి 60 లక్షల మంది మృతి చెందారు’ అని విరుచుకుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని