UP Polls: మోదీ-యోగి ప్రభుత్వాల కళ్లు మూసుకుపోయాయి: సోనియా గాంధీ

కేంద్ర ప్రభుత్వంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు......

Published : 22 Feb 2022 01:37 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలను పూర్తిగా విస్మరించారని విమర్శలు గుప్పించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన యూపీలోని రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశించి సోనియా వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ‘లాక్‌డౌన్‌ సమయంలో మీ వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. కిలోమీటర్ల కొద్దీ నడిచి తీవ్ర వేదన అనుభవించారు. కానీ మోదీ-యోగి ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరించాయి. మీ బాధను పట్టించుకోకుండా ముఖం చాటేసాయి. ఈ ప్రభుత్వాల కళ్లు మూసుకుపోయాయి. మీకు ఎలాంటి ఉపశమనాన్ని అందించలేదు’ అని మండిపడ్డారు.

రైతు సమస్యలు, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి పలు సమస్యల గురించి రెండు ప్రభుత్వాలపై ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తప్ప ఈ ప్రభుత్వాలు మీకు చేసిందేమీలేదన్న సోనియా.. అందుకే ఈ ఎన్నికలు మీకు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. ‘ఎంతో కష్టించి పంటలు పండిస్తారు. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని భాజపా సర్కారు మీకు చెల్లించదు. ఎరువులు అందించదు’ అని దుయ్యబట్టారు.

‘యువత చదువుకుని ఉద్యోగాలకు సిద్ధపడతారు కానీ భాజపా ప్రభుత్వం మిమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెడుతోంది. దాదాపు 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ మీకు ఉద్యోగాలు కల్పించలేదు. పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ, ఆవాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు తమ ఇంటిని నడుపుకోవడం కష్టంగా మారింది’ అని సోనియా తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆదివారం మూడో విడత పోలింగ్‌ జరగగా.. 23న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ దఫాలోనే రాయ్‌బరేలీలోనూ ఎన్నికలు జరుగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని