TDP mahanadu: మూడుసార్లు పోటీ చేశా.. ఈసారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా: నారా లోకేశ్

మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడిన వారికి ఈ సారి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరాదనే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు

Updated : 28 May 2022 06:02 IST

ఒంగోలు: మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడిన వారికి ఈ సారి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరాదనే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. మహానాడు సందర్భంగా నారా లోకేశ్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘పార్టీ నేతలకు సుదీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదనను పెట్టాను. ఈ విధానాన్ని నా నుంచే అమలు చేయాలని భావిస్తున్నా. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశాను. ఈ సారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా. ఈ తరహాలోనే పార్టీలో 2+1 విధానం రావాలి. రెండు పర్యాయాలు వరుసగా ఒక పదవిలో ఉన్న వారికి విరామం ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులను నియమించాల్సి ఉంది. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టతతో ఉన్నారు. మహానాడు తర్వాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెడతాను’’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

పాదయాత్రే కాదు.. ఎలాంటి పోరాటానికైనా సిద్ధం..

‘‘పొత్తులనేవి ఎన్నికల సమయంలో జరిగే చర్చ. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చేపడుతోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్ల కేటాయింపుల్లో వారసులతో పాటు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని యువత ఉంటుంది. యువత అంటే వారసులు మాత్రమే కాదు. వారిలో పార్టీ కోసం పని చేసిన చాలా మంది యువకులు ఉన్నారు. పార్టీ ఆదేశిస్తే పాదయాత్రే కాదు.. ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. గ్రామ గ్రామాన ప్రజల్లోకి వెళ్తాం. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ప్రతిపక్షాలు, ప్రజలను హింసించిన వైకాపా నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తున్నారు. వైకాపా కేడరే ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది’’ అని లోకేశ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని