Nara Lokesh: జగన్ పులివెందులకు ఏం చేశారు?: నారా లోకేశ్‌

90వేల మెజార్టీతో పులివెందుల ప్రజలు జగన్‌ను గెలిపిస్తే.. ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. జయంతి, వర్ధంతికి రావడం తప్ప పులివెందులకి జగన్‌ చేసిందేమీ లేదన్నారు.

Updated : 08 Jun 2023 16:07 IST

వైఎస్ఆర్ జిల్లా: వైఎస్‌ జగన్ పాలనలో రాష్ట్రంలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే అని అన్నారు. గురువారం పులివెందులలోని తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. పులివెందులలో గెలవకపోయినా ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూడలేదన్నారు. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులను అభివృద్ధి చేశామని తెలిపారు.

‘‘పులివెందులకు నీరిచ్చింది తెదేపా. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాం. 90వేల మెజారిటీతో గెలిపించినందుకు జగన్ పులివెందులకు చేసింది ఏంటి? జయంతి, వర్ధంతికి రావడం తప్ప జగన్ ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? పులివెందులలో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. నాడు-నేడు పేరుతో హడావుడి తప్ప పులివెందుల స్కూళ్లలో కనీసం మౌలిక వసతుల్లేవు. రూ.100 కోట్లతో రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాడు జగన్. ఒక్క రోడ్డు కూడా పూర్తి చెయ్యలేదు. పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంలో వేయాల్సిన రోడ్లు పూర్తి చెయ్యలేదు. కనీసం అదనంగా ఒక్క ఎకరాకు జగన్‌ సాగునీరు అందించలేదు’’ అని లోకేశ్‌ విమర్శించారు.

‘‘పార్టీలో సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తాం. కానీ పనిచేసే వారికే పదవులిస్తాం. బూత్‌లో మెజారిటీ తెచ్చిన వారికే పదవులు ఇస్తాం. నాయకులు అందరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. కేసులకు భయపడి ఇంట్లోనే అంటే ప్రజలు హర్షించరు. పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుంది. ఏనాడు గ్రూపు రాజకీయాలని ప్రోత్సహించం. ‘భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమం పులివెందులలో పక్కాగా నిర్వహించాలి. నియోజకవర్గంలో పనిచేయకుండా పదవులు అడగొద్దు. 

కడప జిల్లాలో తెదేపాకి పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. దానిని నాయకత్వం అందిపుచ్చుకోవాలి. నాయకులంతా పోరాడాల్సిందే. పులివెందులకు చెందిన తెదేపా నేతలకు ఎమ్మెల్సీ పదవులిచ్చి గౌరవించాం. ఓడిపోయినా ఇంఛార్జ్‌గా ఉండి పెత్తనం చెయ్యాలనుకుంటే ఇక కుదరదు. ఇంఛార్జ్ వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తెదేపా నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుంచి తొలగిస్తాం. ఢీ అంటే ఢీ అనే వాళ్లనే నేను గుర్తిస్తా’’ అని లోకేశ్ పార్టీ నాయకులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని