హెడ్‌లైన్స్‌ కోసమే నీతీశ్‌ అలా చేస్తున్నారు.. విపక్షాల ఐక్యత కుదిరే పనేనా?: సుశీల్‌ మోదీ

బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ ఈ నెల 12న నిర్వహించే విపక్షాల భేటీపై భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ విమర్శలు గుప్పించారు.

Published : 02 Jun 2023 01:41 IST

దిల్లీ: కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు ఈ నెల 12న బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌(Nitish kumar) పట్నాలో భేటీ ఏర్పాటు చేస్తుండటంపై భాజపా సీనియర్‌ నేత, ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ(Sushil kumar Modi) విమర్శలు చేశారు. విపక్షాల ఐక్యత(Opposition Unity) ఆచరణ సాధ్యం కాదని.. మీడియాలో హెడ్‌లైన్స్‌లో ఉండేందుకే నీతీశ్‌ ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన విపక్షాలతో ఎన్ని భేటీలు నిర్వహించినా క్షేత్రస్థాయిలో అది కుదరని పనన్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యేను తమ పార్టీలో విలీనం చేసుకున్న నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను భాజపాకు బీటీమ్‌గా పేర్కొంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సుశీల్‌ మోదీ గుర్తు చేశారు. అలాగే, దిల్లీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో  ఆప్‌ పోరాటానికి సహకరించొద్దంటూ దిల్లీ, పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీ అగ్రనేతలను కోరుతున్నారన్నారు. యూపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి బీఎస్పీ ఎక్కడా మద్దతు ఇవ్వలేదని తెలిపారు. 

విపక్షాల ఐక్యత కోసం నీతీశ్‌ తనకు చేతనైనంత వరకు ప్రయత్నించొచ్చు గానీ అది ఆచరణ సాధ్యం కాదని స్పష్టమవుతోందని సుశీల్‌ కుమార్‌ మోదీ అన్నారు.  చాలా కాలంగా హెడ్‌లైన్స్‌లో లేకపోవడంతో నీతీశ్‌ ఇప్పుడు మీడియాలో ఉండేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని సమావేశాలు పెట్టినా.. కేరళలో కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి పనిచేస్తాయా? దిల్లీలో కాంగ్రెస్‌, ఆప్‌, తెలంగాణలో భారాస, కాంగ్రెస్‌ చేతులు కలుపుతాయా? అని ప్రశ్నించారు. ఏ ప్రాంతీయ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చి తమ అస్తిత్వానికి ముప్పు తెచ్చుకొనే పనిచేయదన్నారు.

పట్నాలో భేటీకి ఎవరు వెళ్లాలో ఇంకా డిసైడ్‌ కాలేదు.. జైరాం రమేశ్‌

జూన్‌ 12న పట్నాలో జరగనున్న సమావేశానికి కాంగ్రెస్‌ హాజరవుతుందని.. అయితే, తమ పార్టీ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్ అన్నారు. నీతీశ్‌ నిర్వహించే  భేటీకి ఎవరు హాజరు కావాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కచ్చితంగా ఆ భేటీకి హాజరవుతామని స్పష్టంచేశారు.  ప్రస్తుతం  రాహుల్‌ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండగా..  పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ భేటీకి హాజరవుతారా? లేదా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

మరోవైపు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి భాజపాను ఓడించాలనే లక్ష్యంతో బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ కొంత కాలంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే గత నెలలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌తో భేటీ అయ్యారు. అంతేకాకుండా, ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌తోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. విపక్షాల ఐక్యతే లక్ష్యంగా జూన్‌ 12న బిహార్‌లో ఏర్పాటు చేసిన భేటీకి విపక్ష పార్టీల సీనియర్‌ నేతలతో పాటు పలువురు సీఎంలు హాజరవుతారని భావిస్తున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని