టీఎంసీ నాయకులకు క్రమశిక్షణ లేదు: సువేందు

బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నాయకుల పోటాపోటీ విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేదంటూ భాజపా నాయకుడు సువేందు అధికారి తాజాగా  ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Published : 27 Dec 2020 00:59 IST

కోల్‌కతా: బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నాయకుల పోటాపోటీ విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేదంటూ భాజపా నాయకుడు సువేందు అధికారి తాజాగా  ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని.. దేశసేవ కోసమే అంకితమై పనిచేస్తుందని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘టీఎంసీ నుంచి వైదొలిగిన మేం క్రమశిక్షణ గల సైనికులం. అందుకే రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారు బెంగాల్‌(సోనార్‌ బెంగాల్‌) అవుతుంది. చాలా రాష్ట్రాల్లో రైతులు పీఎం కిసాన్‌ నగదు ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ కేవలం బెంగాల్‌ ప్రజలను మాత్రమే ఇక్కడి ప్రభుత్వం ఆ పథకానికి దూరం చేసింది’ అని సువేందు వారిపై విమర్శలు గుప్పించారు. 

భాజపా జాతీయ కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ మాట్లాడుతూ.. ‘భాజపాను ‘ఔట్‌సైడర్స్‌’ పార్టీ అని దీదీ అంటున్నారు. కానీ జనసంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్‌ ముఖర్జీనే బెంగాల్‌ ప్రస్తుత పరిస్థితికి కారణం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఒక్క మమతా బెనర్జీ తప్ప ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది. పొరుగుదేశమైన పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ప్రజలు సైతం మోదీని గౌరవిస్తారు. అక్కడి నుంచి మోదీకి రాఖీలు పంపిస్తారు. కానీ దీదీ మాత్రం భాజపా నాయకుల్ని ఔట్‌సైడర్స్‌ అంటూ రెచ్చగొడుతున్నారు. బెనర్జీ తెల్ల చీర, స్లిప్పర్స్‌ ధరించి సాధారణ వ్యక్తిలా కనిపిస్తారు. కానీ ఆమె అల్లుడు అభిషేక్‌ బెనర్జీ రూ.25లక్షలు విలువ చేసే కళ్లద్దాలు, రూ.7 కోట్ల విలువ చేసే ఇంట్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎంసీ పాలన నియంతృత్వ రాజ్యాన్ని తలపిస్తోంది ’ అని విమర్శించారు. 

ఇదీ చదవండి

కరోనాలోనూ రైలు కూత ఆగలేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని