Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. గాంధీలెవరూ పోటీలో ఉండరు..!

గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం పోటీ పడే జాబితాలో ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి.

Updated : 23 Sep 2022 11:32 IST

దిల్లీ: గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అంశం రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం పోటీ పడే జాబితాలో ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. గాంధీలు పోటీ చేస్తారా..? లేదా..? విషయంలో మాత్రం ఇన్నాళ్లు స్పష్టత లేదు. ఇప్పుడు దానిపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి,కాంగ్రెస్‌ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ స్పందించారు. 

గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్షుడిగా ఉండరని రాహుల్‌ గాంధీ వెల్లడించారని గహ్లోత్ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారనీ.. ఇదే విషయం చెప్పి, ఆయన్ను ఒప్పించేందుకు పలుమార్లు ప్రయత్నించామని  ఆయన తెలిపారు. అయితే.. దీనికి రాహుల్‌ తిరస్కరించినట్లు గహ్లోత్‌ వివరించారు.

‘‘నేను అధ్యక్ష పదవి చేపట్టాలని వారు కోరుకుంటున్నారని నాకు తెలుసు. నేను వారి ఆకాంక్షను గౌరవిస్తాను. కానీ, గాంధీయేతరులు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. పార్టీ తదుపరి అధ్యక్షుడిగా గాంధీ కుటుంబం నుంచి ఎవరు ఉండకూదని నిర్ణయం తీసుకున్నాను’’ అని రాహుల్‌ తనతో చెప్పారని గహ్లోత్ మీడియాకు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. ఈ అధ్యక్ష ఎన్నిక బరిలో గహ్లోత్ ముందువరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా ఆయనే పార్టీ అధినేత అవుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శశిథరూర్‌, దిగ్విజయ్ సింగ్, కమల్‌ నాథ్ వంటి పలువురు సీనియర్ నేతల పేర్లూ వెలుగులోకి రావడంతో ఎన్నిక అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ ఎన్నికకు సంబంధించి నిన్న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 1న నామినేషన్‌ పత్రాలను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఇచ్చారు. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే అక్టోబరు 17న ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబరు 19న ఫలితాలను వెల్లడిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని