Karnataka: ఇది 40 శాతం కమీషన్‌ సర్కార్‌..! ప్రియాంక ఆరోపణలు

భాజపా ప్రభుత్వం కర్ణాటక నుంచి రూ.1.5 లక్షల కోట్లు లూటీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరులోని టీ నరసిపురలో ఓ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. 

Published : 25 Apr 2023 16:22 IST

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) రాష్ట్రంలో పర్యటిస్తూ.. కాంగ్రెస్‌ (Congress)పై విమర్శలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అధికార భాజపా (BJP) ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు లూటీ చేసిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరులోని టీ నరసిపురలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు.

‘ఇక్కడి 40 శాతం కమీషన్‌ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడం బాధాకరం. వివిధ కుంభకోణాలు, కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని.. కాంట్రాక్టర్ల సంఘం దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది’ అని ప్రియాంక విమర్శించారు. ‘ఓ ఎమ్మెల్యే కుమారుడి వద్ద రూ.8 కోట్లు పట్టుబడినప్పటికీ.. ఈ వ్యవహారంపై సరైన విచారణ లేకుండా పోయింది. కర్ణాటక నుంచి భాజపా ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బును అనేక అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం ఉండేది’ అని వ్యాఖ్యానించారు. అమూల్- నందిని వివాదంపై మాట్లాడుతూ.. కర్ణాటక 'నందిని' బ్రాండ్‌ను కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని, బయటి నుంచి ఏ సంస్థ రాదని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని