Parliament: మొసలి కన్నీరెందుకు? దేశానికి క్షమాపణలు చెప్పండి

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏడుగురు కేంద్రమంత్రులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ......

Published : 13 Aug 2021 01:27 IST

ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రులు గరంగరం

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏడుగురు కేంద్రమంత్రులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌ను సజావుగా సాగనీయకుండా ఆటంకం సృష్టించడం, బెదిరింపు ధోరణులతో వ్యవహరించినందుకు ప్రతిపక్షం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడిచేయించారన్న విపక్ష నేతల ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయని, పార్లమెంట్‌లోకి బయటివారెవరినీ అనుమతించలేదని కేంద్రమంత్రులు స్పష్టంచేశారు. మంగళవారం రోజున కొందరు విపక్ష ఎంపీలు రాజ్యసభలో టేబుల్‌పైకి ఎక్కి ఏదో గొప్పపని చేసినట్టు ఫీలయ్యారని, ఆ వీడియోలను ట్విటర్‌లో కూడా పోస్ట్‌ చేశారని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అన్నారు. పార్లమెంట్‌ సజావుగా సాగనీయకూడదని ముందస్తుగానే కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిపక్ష ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌ను డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

ఈ తరహా ప్రవర్తన పార్లమెంటీరియన్లకు సమంజసం కాదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు. సభలో ఫర్నీచర్‌, తలుపులు విరగ్గొట్టడం, ప్రకటన చేస్తున్న మంత్రుల నుంచి పేపర్లు లాక్కొని చింపేయడం, మార్షల్స్‌పై చేయిచేసుకోవడం వంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది యావత్‌ దేశానికే సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్షాల ప్రవర్తన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత దిగజార్చేలా ఉందన్నారు. దేశ ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరుకు దేశ ప్రజలకు ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ డిమాండ్‌ చేశారు. వీధుల నుంచి పార్లమెంట్‌ దాకా అరాచకం సృష్టించడమే విపక్షాలు  అజెండాగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రాజ్యసభలో సెక్రటరీ జనరల్‌ టేబుల్‌ నృత్యాలు చేయడానికో, నిరసనల కోసమో కాదని మండిపడ్డారు.  తమ సమస్యల్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కానీ అవేమీ విపక్షానికి పట్టడంలేదని దుయ్యబట్టారు. మొసలి కన్నీరు కార్చడానికి బదులుగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని