వీలైనంత త్వరగా మీ ముందుకొస్తా: పవన్‌

కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు సూచించారు.

Updated : 18 Oct 2022 16:45 IST

హైదరాబాద్‌: కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు సూచించారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. తన ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పారు. తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ జనసేనాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పవన్‌ పేరిట జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆ పదాలతో నా భావోద్వేగాన్ని చెప్పలేను

‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నాను. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను. నేను కరోనా బారినపడ్డానని తెలిసినప్పటి నుంచి నా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ని కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. సందేశాలు పంపించారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు నేను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేను. ఎప్పటికీ మీరంతా నా కుటుంబ సభ్యులే. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి.. మీతోపాటే ప్రజల కోసం నిలబడతాను.

ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలి

అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో 7వేలు.. తెలంగాణలో 4వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ అంతకు కొన్ని రెట్లు కేసులున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలి. ఏపీలో కరోనా బారిన పడిన వారికి అవసరమైన మేరకు బెడ్స్‌, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. పరిస్థితిని ముందే అంచనా వేసి వాటిని ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆందోళనకర స్థితి నెలకొంది. ఆస్పత్రుల్లో బెడ్స్‌ లేవని రోగులను చేర్చుకోలేని పరిస్థితి వచ్చింది. రోగులకు అవసరమైన మందుల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసరంగా కొవిడ్‌ కేంద్రాలను భారీగా తెరిచి వైద్య పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలి. కరోనా వ్యాప్తి నిరోధంలో ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నా ప్రజలు తమ వంతు బాధ్యతగా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి’’ అని పవన్‌ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని