
AP Politics : భాజపావి దిగజారుడు రాజకీయాలు : పేర్ని నాని
అమరావతి: కడప జైలులో ఉన్న ఓ రిమాండ్ ఖైదీని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి జైలుకు రావడం రాజకీయాలను దిగజార్చిందని ఏపీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మనుషులు, ఉద్యోగులపై దాడులు చేసిన ముద్దాయిని కేంద్ర మంత్రి పరామర్శించడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని భాజపా నేతలు ఏం చేయాలనుంటున్నారని ఆయన ప్రశ్నించారు. భాజపా నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. కడప కారాగారంలో రిమాండులో ఉన్న భాజపా కర్నూలు జిల్లా నాయకుడు బుడ్డా శ్రీకాంత్రెడ్డిని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ పరామర్శించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో ప్రజలకు నష్టం కలిగించే పనులు జరుగుతుంటే కేంద్ర పరిధిలోని ఎన్ఐఎ, ఐబీ ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రిగా దేశ ప్రతిష్ఠను కాపాడాల్సిన మురళీధరన్ ఇలా ప్రవర్తించడం హేయమన్నారు. భగవంతుడే భాజపా బారినుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. సంక్రాంతికి పోలీసులు వద్దన్నా ప్రజలు బేఖాతరు చేసి కోడిపందేలు జరుపుకున్నారని గత ప్రభుత్వం హయాంలోనూ ఇవి జరిగాయని పేర్ని నాని అన్నారు. గుడివాడలో ఏదో జరిగిందంటున్న వారు నిజ నిర్ధారణ కోసం పోలీసులను ఆశ్రయించవచ్చు కదా అని అన్నారు.మంత్రి కొడాలి నానిని చంద్రబాబు మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు.