UP Polls: కాంగ్రెస్‌ హామీలు.. రైతుల రుణమాఫీ, 20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు.

Published : 09 Feb 2022 16:00 IST

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ప్రియాంకా గాంధీ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆమె.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే మహిళలు, యువతకు సంబంధించి పలు హామీలను ఇచ్చిన ప్రియాంకా గాంధీ.. ‘జన్‌ ఘోషనా పత్రా’ పేరుతో పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి తొలి దశ పోలింగ్‌ జరుగనుండగా.. ఇందుకు ఒకరోజు ముందే పార్టీ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రకటించింది.

‘మహిళలు, యువతకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను ఇదివరకు విడుదల చేశాం. నేడు పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాం. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించాం. సాధారణ పౌరులు, కార్మికులు, రైతులతోపాటు అన్ని వర్గాలకు చెందిన లక్ష మందితో మాట్లాడాం. ఇది ప్రజల మేనిఫెస్టో’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం అతి ముఖ్యమైన సమస్యలుగా పేర్కొన్న ఆమె.. గతంలో ఛత్తీస్‌గడ్‌లో చేసినట్లుగా ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. వరి, గోధుమలను క్వింటాల్‌కు రూ.2500 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, చెరకుకు ప్రతి క్వింటాల్‌కు రూ.400 చెల్లిస్తామంటూ మేనిఫెస్టోలోని అంశాలను ప్రియాంక గాంధీ వెల్లడించారు.

* రైతుల కరెంటు బిల్లులను సగానికి తగ్గిస్తాం. కొవిడ్‌ ఉద్ధృతి కాలంలో కరెంటు బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తాం

* వివిధ కారణాలతో పంట కోల్పోయిన రైతులను రూ.3వేల నష్ట పరిహారం చెల్లిస్తాం

* 20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం

* 12లక్షల బ్యాక్‌లాగ్‌ పోస్టులతో పాటు మరో 8లక్షల ఉద్యోగాలను కలిపి అన్నింటినీ భర్తీ చేస్తాం

* కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు రూ.25వేల ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు పలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. అధికార భాజపా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పటికే పలు వాగ్దానాలతో ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తాజాగా కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని