Rahul disqualification: రాహుల్‌ అనర్హత వెనుక కాంగ్రెస్‌లోనే కుట్ర!: భాజపా

BJP on Rahul disqualification: రాహుల్‌ అనర్హత వేటుపై కేంద్రంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ స్పందించింది. అనర్హతకు ఆ పార్టీలోనే కుట్ర జరిగిందని ఆరోపించింది.

Published : 24 Mar 2023 21:23 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అనర్హత (Rahul disqualification) వేటుకు ప్రభుత్వం గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ (BJP) స్పష్టంచేసింది. క్రిమినల్‌ కేసుల్లో నేరస్థుడని నిరూపితమైనప్పుడు అనర్హత వేటు వర్తిస్తుందని సుప్రీంకోర్టే స్పష్టంగా పేర్కొందని గుర్తు చేసింది. రాహుల్‌పై అనర్హత పడిన నేపథ్యంలో విపక్షాలు కేంద్రంలోని భాజపా సర్కారే లక్ష్యంగా విమర్శల గుప్పిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ స్పందించింది. ఈ మేరకు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్‌, అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ అనర్హత వెనుక కాంగ్రెస్‌లో అంతర్గత కుట్రే కీలక భూమిక పోషించిందని ఆరోపించారు.
Also Read: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు గంటల వ్యవధిలోనే పైకోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ నేతలు.. రాహుల్‌ విషయంలో ఎందుకు అలా చేయలేదని మంత్రులు ప్రశ్నించారు. గురువారం తీర్పు వెలువడితే ఎందుకు పైకోర్టుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుట్రే దీనికి కారణమని ఆరోపించారు. రాహుల్‌ గాంధీని వదిలించుకోవాలని అనుకుంటున్న ఆ వ్యక్తులు ఎవరు అని అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. ఆ పార్టీలో చాలా మంది లాయర్లు ఉన్నప్పటికీ.. రాహుల్‌ను కావాలనే తప్పుదోవ పట్టించారన్నారు. 2019 నాటి కేసులో గురువారం సూరత్‌ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు ఏ కోర్టునూ ఆశ్రయించకపోవడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

రాహుల్‌ అనర్హత వేటుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని విమర్శలనూ భాజపా నేతలు తిప్పికొట్టారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ.. మరీ ముఖ్యంగా నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యులు తమకు దోషులుగా కాకుండా ఉండేందుకు ప్రత్యేక ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఉండాలని అనుకుంటారు. ప్రత్యేక న్యాయవ్యవస్థ ఉండాలని భావిస్తుంటారు. వారి ఫ్యూడల్‌ భావాలే దానికి కారణం. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమన్నది వారు ఎప్పటికి అర్థం చేసుకుంటారో’’ అంటూ ప్రదాన్‌ విమర్శించారు.
Also Read: రాహుల్‌పై వేటు.. ఇది చీకటి రోజు: విపక్షాల ఆగ్రహం

రాహుల్‌ గాంధీ ‘అలవాటు పడిన నేరుస్థుడు’ అని అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. తాను ఏది మాట్లాడినా ఏం జరగదని అభిప్రాయపడుతుంటారని, తాను పార్లమెంట్‌కు, దేశానికి అతీతుడు అని భావిస్తుంటారని విమర్శించారు. గతంలో రాఫెల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పినా రాహుల్‌ తన మైండ్‌ సెట్‌ను మార్చుకోలేదని అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమైనా సున్నా సున్నా కలిస్తే ఏమవుతుందో అదే జరుగుతుందని ప్రదాన్‌ ఎద్దేవాచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని