Rahul Gandhi: అదానీ కోసం రూల్సే మార్చేశారు.. కేంద్రంపై రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు

Rahul Gandhi takes swipe at Modi govt: అదానీ ఎదుగుదలలో ప్రధాని మోదీ ఉన్నారంటూ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆయన కోసం నిబంధనలను సైతం మార్చేశారన్నారు.

Updated : 07 Feb 2023 19:05 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Groupi) వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్‌అదానీ  (Gautam adani) అనతికాలంలో ప్రపంచ కుబేరుడిగా అవతరించారంటూ విమర్శించారు. అదానీ కోసం ఏకంగా నిబంధనలనే మార్చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌ గాంధీ మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమ్‌ అదానీ వ్యవహారంపై సుదీర్ఘంగా మాట్లాడారు.

‘‘ఎయిర్‌పోర్టుల నిర్వహణలో పూర్వ అనుభవం లేనివారికి వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ, ఆ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఏకంగా దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టులను అదానీకి కట్టబెట్టింది. అత్యంత లాభదాయకమైన విమానాశ్రయాల్లో ఒకటైన ముంబయి ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించింది. ఇందుకోసం జీవీకే గ్రూప్‌పై సీబీఐ, ఈడీలను ప్రయోగించింది’’ అంటూ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారు.

‘‘2014లో 8 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 నాటికి 140 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందని యువత అడుగుతున్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా తమిళనాడు, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌.. ఇలా పాదయాత్ర చేపట్టిన ప్రతి చోటా అదానీ పేరు వినిపించింది. ఆయన అడుగు పెట్టిన ప్రతి వ్యాపారంలోనూ ఎలా సక్సెస్‌ అవుతున్నారంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు’’ అని రాహుల్‌ ఎద్దేవాచేశారు.

‘‘ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళితే అదానీ గ్రూప్‌నకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1 బిలియన్‌ డాలర్లు రుణం ఇచ్చింది. ప్రధాని బంగ్లాదేశ్‌ వెళితే అక్కడి పవర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు అదానీకి 25 ఏళ్ల కాంట్రాక్టు అప్పగించింది. ఇదేం మ్యాజిక్‌’’ అని రాహుల్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు అదానీతో కలిసి  ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? విదేశాల్ల్లో ఎన్నిసార్లు అదానీని కలిశారు? భాజపాకు గడిచిన 20 ఏళ్లలో అదానీ ఎంతిచ్చారు? అంటూ రాహుల్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. అగ్నిపథ్‌ స్కీమ్‌నూ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఆర్మీని ఈ పథకం బలహీన పరుస్తుందని సీనియర్‌ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు.

అధికార పక్షం అభ్యంతరం

లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగం సమయంలో అధికార పక్షం నుంచి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు రాహుల్‌కు సూచించారు. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తన ప్రసంగం మధ్యలో అదానీతో మోదీ సంబంధాలకు సంబంధించి వారు ఇద్దరూ కలిసి ఉన్న చిత్రాలను లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రదర్శించారు. దీనిపై స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాత్రమే మాట్లాడాలన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు