Rahul Gandhi: ‘పాంగాంగ్‌’ పై చైనా వంతెన నిర్మాణం.. ప్రధాని మోదీ మౌనమేల?

భారత్‌ సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనా పాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మిస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని.......

Published : 05 Jan 2022 01:57 IST

దిల్లీ: భారత్‌ సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనా పాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మిస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ప్రధాని మౌనం భరించలేనిదన్న రాహుల్‌.. మన భూమి, మన ప్రజలు, మన సరిహద్దులు ఎంతో బాగుండాలంటూ ట్వీట్‌ చేశారు. లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖకు అత్యంత సమీపంలోని పాంగాంగ్‌ సరస్సుపై చైనా గత రెండు నెలలుగా వంతెన నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. పాంగాంగ్‌ సరస్సులోని ఉత్తర, దక్షిణ కాల్వలను కలుపుతూ ఈ నిర్మాణం చేపడుతోంది. 2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు చెలరేగినప్పట్నుంచి తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో భద్రతలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

భారత్‌తో సరిహద్దుల్లో చైనా తన దూకుడును మరింతగా పెంచింది. తమ భూభాగంలో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగానే తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై ఓ కీలక వంతెనను ప్రస్తుతం నిర్మిస్తోంది. తాజాగా బయటికొచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, ఆయుధ సామగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించేందుకు వంతెన దోహదపడనుంది. దాని నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరితగతిన పూర్తిచేసేందుకుగాను దాని నిర్మాణంలో ఫాబ్రికేటెడ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. గల్వాన్‌ ఘర్షణల తర్వాత భారత సైన్యం పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కీలక కైలాశ్‌ రేంజ్‌ పర్వత శిఖరాలను ఆక్రమించింది. అక్కడికి భారీగా బలగాలను తరలించింది. తద్వారా ఆ ప్రాంతంలో చైనా బలగాలపై పైచేయి సాధించింది. అప్పటి నుంచి అక్కడ పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని