Satya Pal Malik: రాజ్‌నాథ్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై సత్యపాల్ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు

రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) ప్రధాని అభ్యర్థిత్వంపై జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ (Satya Pal Malik) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) భాజపా(BJP) గెలుపు కోసం భాజపా చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయని మాలిక్ వ్యాఖ్యానించారు.

Published : 25 Apr 2023 21:51 IST

జైపూర్‌: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) ప్రధాన మంత్రి (Prime Minister) కావాలనుకుంటే ఎప్పుడో ఆ పదవి ఆయనకు దక్కేదని జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ (Satya Pal Malik) అన్నారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ మౌనం వీడకపోతే భాజపాకే నష్టం వాటిల్లుతుందన్న ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) గెలుపు కోసం భాజపా (BJP) కష్టపడాల్సిందేనని చెప్పారు. ‘‘ రాజ్‌నాథ్‌ సింగ్ ప్రధాని పదవి చేపట్టేందుకు అర్హుడు. ఆయన ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో ఆయనకు ఆ పదవి ఆ దక్కేది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం భాజపాకు అంత సులువేం కాదు. ఆ పార్టీ గెలవాలనే నేను కోరుకుంటున్నా. కానీ, రాజకీయాల్లో, ఎన్నికల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుత పరిస్థితి భాజపాకు కొంత క్లిష్టంగానే ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు వారు చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి’’ అని సత్యపాల్ మాలిక్‌ అన్నారు. 

పదవి నుంచి వైదొలగిన తర్వాత పుల్వామా ఘటన నుంచి మాట్లాడుతున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనపై చేసిన వ్యాఖ్యలను మాలిక్‌ ఖండించారు. 2019 పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన సమయంలో సత్యపాల్ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్నారు. ఇంజెలిజెన్స్ వైఫల్యం కారణంగానే ఆ దాడి జరిగిందని ఆనాడే ప్రధాని మోదీకి చెప్పానంటూ కొద్దిరోజుల క్రితం మాలిక్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలను అమిత్ షా తప్పుబట్టారు. జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఓ బీమా పథకం ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని గతంలో సత్యపాల్ మాలిక్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 28న విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ, భాజపా ప్రభుత్వంపై ఆరోపణల కారణంగానే సత్యపాల్‌ మాలిక్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చిందని వస్తోన్న విమర్శలను సైతం అమిత్‌ షా కొట్టిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని