బిహార్‌లో మజ్లిస్‌కు షాక్‌.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్‌!

బిహార్‌ 2020లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల్లో నలుగురు సభ్యులు తాజాగా ఆర్‌జేడీ (RJD)లో చేరిపోయారు.

Published : 30 Jun 2022 01:53 IST

రాంచీ: రెండేళ్ల క్రితం బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుచుకుని ఏఐఎంఐఎం (AIMIM) తన ప్రాబల్యాన్ని చాటుకుంది. అయితే, ఆ సంతోషం కొద్దిరోజులకే పరిమితమయ్యింది. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు తాజాగా ఆర్‌జేడీ (RJD)లో చేరిపోయారు. బిహార్‌ అసెంబ్లీలో ఎంఐఎంకు ప్రస్తుతం ఒకరు మాత్రమే మిగిలారు. దీంతో బిహార్‌ అసెంబ్లీలో ఆర్‌జేడీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తన కారులో కూర్చొబెట్టుకొని అసెంబ్లీకి తీసుకెళ్లిన ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav).. తాజా పరిణామం లౌకిక శక్తులను బలోపేతం చేయడమేనన్నారు.

ఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు వారిని ప్రత్యేక బృందంగా పరిగణించి ఆర్‌జేడీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హా ప్రకటించారు. దీంతో బిహార్‌ అసెంబ్లీలో ఆర్‌జేడీ బలం 80కి చేరుకున్నట్లయ్యింది. ఇవి భాజపా కంటే ఎక్కువ సీట్లు కావడం విశేషం.

ఇదిలాఉంటే, 283 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో 2020 ఎన్నికల్లో ఆర్‌జేడీ 75 స్థానాల్లో గెలుపొందింది. ఎన్‌డీఏ కూటమిలోని భాజపా 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాయి. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్‌జేడీ విజయం సాధించడంతో ఆ సంఖ్య 76కి చేరింది. తాజాగా నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో ఆర్‌జేడీ బలం 80కి చేరి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని