Andhra news: వైకాపా శాశ్వత అధ్యక్ష పదవిని జగన్‌ తిరస్కరించారు: సజ్జల

వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటూ జూలైలో జరిగిన ప్లీనరీలో 

Published : 23 Sep 2022 02:22 IST

అమరావతి: వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటూ జూలైలో జరిగిన ప్లీనరీలో చేసిన తీర్మానం ఆమోదం పొందలేదని వైకాపా నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని సీఎం జగన్  తిరస్కరించారన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ  స్పష్టత ఇవ్వాలని తమను కోరిందని తెలిపారు. వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఉండాలని జూలైలో జరిగిన ప్లీనరీలో తీర్మానం చేపట్టిన మాట వాస్తవమేనన్న ఆయన.. కార్యకర్తల కోరిక మేరకు తీర్మానం చేసినట్టు వివరించారు. అయితే, ఆ పదవిని వైఎస్ జగన్ తిరస్కరించినందున తీర్మానం అమల్లోకి రాలేదన్నారు. 

ప్లీనరీలో తీర్మానం ఆమోదం పొందలేదని, మినిట్స్‌లోనూ లేదన్నారు. ఈసీకీ తాము ఏ తీర్మానాన్నీ పంపించలేదని చెప్పారు. జీవిత కాల అధ్యక్ష పదవి విషయమై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అడిగినందున.. ప్రస్తుతం ఆ తీర్మానం అమల్లో లేదని ఈసీకి చెబుతామన్నారు. గత ఫిబ్రవరిలో పార్టీలో చేసిన సవరణ ప్రకారం వైఎస్ జగనే వైకాపా అధ్యక్షుడుగా ఉన్నారన్నారు. ఐదేళ్ల పాటు తమ పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా వైఎస్ జగన్ కొనసాగుతారంటూ.. అప్పట్లోనే ఈసీకి పంపామన్నారు. వైకాపాలో ఐదేళ్లకొకసారి పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా సజ్జల స్పష్టంచేశారు.

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని