Gujarat Polls: టికెట్‌ ఇస్తారా....స్వతంత్రంగా బరిలో దిగమంటారా!

గుజరాత్‌లో అధికార భాజపాకు సీట్ల కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారింది. తమకు టికెట్‌ కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతామని కొందరు నేతలు అధిష్ఠానాన్ని బెదిరిస్తున్నట్లు సమాచారం.

Published : 13 Nov 2022 01:32 IST

భాజపాకి అభ్యర్థుల బెదిరింపులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు వివిధ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ జాబితాలు విడుదల చేస్తున్నాయి. అయితే, అధికార భాజపాకు మాత్రం సీట్ల కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారింది. తమకు టికెట్‌ కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతామని కొందరు నేతలు అధిష్ఠానాన్ని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టికెట్‌ కోల్పోయిన ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యేతోపాటు, మరి కొందరు మాజీ ఎమ్మెల్యేలు స్వతంత్రంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకోగా.. ఇంకొందరు మద్దతుదారుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

భాజపా మాజీ ఎమ్మెల్యే, షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ మోర్చా అధ్యక్షుడు హర్షద్‌ వాసవ తనకు టికెట్‌ కేటాయించకపోవడంతో శుక్రవారమే నర్మద జిల్లాలోని నాందోడ్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ సమర్పించారు. ప్రస్తుతం ఈ స్థానం కాంగ్రెస్‌ చేతిలో ఉంది. ఈ స్థానానికి భాజపా నుంచి దర్శన దేశ్‌ముఖ్ బరిలో నిలిచారు. 2002 నుంచి 2012 వరకు రెండు పర్యాయాలు రాజ్‌పిప్ల నియోజకవర్గం నుంచి హర్షద్ వాసవ ప్రాతినిధ్యం వహించారు. తాజాగా పార్టీ తీసుకున్న నిర్ణయంతో అసహనానికి గురై పార్టీ పదవికి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

మరోవైపు వఘోడియా అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మధు శ్రీవాస్తవకు ఈసారీ టికెట్‌ దక్కకపోడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థానం నుంచి భాజపా అశ్వనీ పటేల్‌ను తన అభ్యర్ధిగా రంగంలోకి దించింది. వీరితోపాటు వడోదరలోని పద్రా స్థానం నుంచి దినేశ్‌ పాటిల్‌, కర్జన్‌ స్థానం నుంచి భాజపా మాజీ ఎమ్మెల్యే సతీశ్ పాటిల్‌ స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.వీరితోపాటు పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై మరికొందరు గుర్రుగా ఉన్నారు. వారిలో కొందరు స్వంత్రులుగా పోటీ చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని