Sonia Gandhi: సోనియా గాంధీ ఇటలీ ఇంటి విలువ తెలుసా..?అఫిడవిట్‌లో వెల్లడి

తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సోషల్‌ మీడియా ఖాతాలు లేవని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) వెల్లడించారు. 

Updated : 16 Feb 2024 19:58 IST

దిల్లీ: 25 ఏళ్లపాటు వరుసగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi).. ఈసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. రాయ్‌బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్‌ నుంచి పెద్దల సభకు వెళ్లనున్నారు. నామినేషన్ పత్రాలతో పాటు తన పోల్‌ అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను సమర్పించారు. దాని ప్రకారం..

సోనియా గాంధీ(Sonia Gandhi) చర, స్థిర ఆస్తుల విలువ రూ.12,53,76,822 గా ఉంది. 2014లో ఆమె సంపద విలువ రూ.9.28 కోట్లుగా ఉండగా.. 2019లో ఆ మొత్తం రూ.11.82 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆమె వద్ద కోటి రూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయి. వాటితో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల ద్వారా ఆమె చర ఆస్తులు రూ.6.38 కోట్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే వడ్డీ, ఎంపీ జీతమే తన ఆదాయ వనరని పేర్కొన్నారు. అలాగే స్వదేశమైన ఇటలీలో తనకు వారసత్వంగా వచ్చిన నివాసం గురించి ప్రస్తావించారు. 2014లో ఆ ఇంటి విలువ రూ.19.9 లక్షలు కాగా.. అది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 27 లక్షలు (రూ.26.83 లక్షలు) పలుకుతోంది.

రాజ్యసభకు సోనియా.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక?

తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని అఫిడవిట్‌లో సోనియా(Sonia Gandhi) వెల్లడించారు. తాను ఇంతవరకు ఏ క్రిమినల్‌ కేసులోనూ దోషిగా తేలలేదని పేర్కొన్నారు. అలాగే తన విద్యార్హతలను ప్రస్తావించారు. 1964లో విదేశీ భాషల్లో మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేశారు. 1965లో ఇంగ్లిష్‌లో సర్టిఫికేట్‌ కోర్సు చేశారు. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ జారీచేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని