Sonia Gandhi: రాజ్యసభకు సోనియా.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక?

Sonia gandhi: 25 ఏళ్లపాటు వరుసగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన సోనియా గాంధీ పెద్దల సభకు వెళ్లనున్నారు. రాయ్‌బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. అనారోగ్యమా? ప్రియాంక కోసమా?

Updated : 14 Feb 2024 22:42 IST

Sonia Gandhi | ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్షోభ సమయంలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టారు.. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా యూపీఏ ఛైర్‌పర్సన్‌గా రాజకీయాల్లో సోనియా గాంధీ(Sonia Gandhi) ఎంతో హుందాగా వ్యవహరించారు. దాదాపు 25 ఏళ్ల పాటు వరుసగా లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్న వేళ ప్రస్తుతం రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం గురించి సర్వత్రా చర్చ మొదలైంది.

రాజస్థాన్‌ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్‌కు దక్కనుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లనున్నారు. తాజాగా బుధవారం నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. పెద్దల సభ సభ్యురాలిగా ఉన్నారు.

కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల..రాజస్థాన్‌లో సోనియా నామినేషన్‌ దాఖలు

అలా పొలిటికల్‌ ఎంట్రీ..

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణానంతరం 8 ఏళ్ల తర్వాత ఎలాంటి రాజకీయ అనుభవమూ లేని సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అందుకున్నారు. 1999లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానాల నుంచి ఏకకాలంలో పోటీ చేసి రెండింటా గెలుపొందారు. అమేఠీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2004 ఎన్నికల్లో పార్టీ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి మారారు. అప్పటి నుంచి లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. అమేఠీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూసినా.. సోనియా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో సోనియా గాంధీ కీలక భూమిక పోషించారు. ఆ సమయంలో ప్రధాని పదవిని చేపట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. విపక్షాలకు ఆయుధం (ఇటలీ పౌరురాలు) కాకూడదన్న ఉద్దేశంతో పార్టీ వ్యవహారాలకే పరిమితమయ్యారు.

ప్రియాంక ఎంట్రీ?

గాంధీ కుటుంబం నుంచి వారసులుగా రాహుల్‌ గాంధీ మాత్రమే ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అమేఠీ నుంచి ఓటమి చవిచూసిన రాహుల్‌.. ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు పార్టీ పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ. ప్రియాంక గాంధీ మాత్రం ఇప్పటివరకు ఎన్నికల బరిలో నిలవలేదు. ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు ప్రచారం జరిగినా.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభకు వెళుతున్న వేళ.. ప్రియాంక గాంధీ పొలిటికల్‌ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాయ్‌బరేలీ నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు వయోభారం, అనారోగ్య కారణాల రీత్యా సోనియాగాంధీ లోక్‌సభ సీటును వదులుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బరేలీ నుంచి పోటీ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని