Sonia Gandhi: సోనియాతో ముగిసిన ఆజాద్‌ భేటీ.. వాటిపైనే చర్చ!

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌తో దిల్లీలో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో సమష్టి నాయకత్వం కోసం......

Updated : 18 Mar 2022 20:30 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీలోని జి-23 బృందంలో కీలక నేత గులామ్‌ నబీ ఆజాద్‌ కీలక భేటీ ముగిసింది. దిల్లీలోని 10 జన్‌పథ్‌లో సమావేశం అనంతరం ఆజాద్‌ మీడియాతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో శత్రువులను ఐక్యంగా ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించినట్టు చెప్పారు. సోనియాతో భేటీ బాగా జరిగిందన్నారు. మీడియాకు ఇది వార్తే కావొచ్చు. కానీ, ఇది రెగ్యులర్‌గా జరిగే మామూలు భేటీయేనని తెలిపారు. వచ్చే ఎన్నికలకు ఐక్యంగా ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై చర్చించామన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ చర్చలు జరుపుతున్నారనీ.. ఇటీవల జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కూడా పార్టీని ఎలా బలోపేతం చేయాలి? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటి? అనే అంశాలపై సోనియా సభ్యుల సూచనలు కోరారన్నారు. పార్టీ బలోపేతానికి తాను కూడా సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. తాను చేసిన సూచనలు పార్టీ అంతర్గత విషయాలనీ.. వాటిని బహిర్గతం చేయలేనన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని ఏకగ్రీవంగా ఆమోదం జరిగిందన్న ఆయన.. నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేదని స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌లో సమష్టి నాయకత్వం కోసం జి-23 నేతలు బలంగా డిమాండ్‌ చేస్తున్న వేళ ఆజాద్‌తో సోనియా భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జి-23 నేతలు వరుస భేటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన వేళ మరోసారి జి-23 నేతలు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంపై తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు, నిన్న జి-23 నేతల్లో ఒకరైన హరియాణా మాజీ సీఎం భూపీందర్‌సింగ్‌ హుడా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో నిన్న భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన భేటీలో పార్టీలో అవసరమైన సంస్కరణలపై చర్చించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సమావేశాన్ని జి-23 నేతలకు దగ్గరయ్యేందుకు ‘గాంధీల’ కుటుంబం చేసిన ప్రయత్నంగా కొందరు అభివర్ణించారు. ‘గాంధీలు’ పార్టీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగి.. ఇతరులెవరికైనా పగ్గాలు అప్పగించాలని జి-23 నేతల్లో ఒకరైన కపిల్‌ సిబల్‌ ఇటీవల డిమాండ్‌ చేయగా.. అది తమ బృందానికి ఆమోదయోగ్యం కాదని, గాంధీలు పూర్తిగా పక్కకు తప్పుకోవాలని తాము కోరుకోవడం లేదని హుడా రాహుల్‌తో అన్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కావడమే తమకు కావాలని పేర్కొన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని