Published : 05 Aug 2021 01:46 IST

Karnataka Cabinet Expansion: 29మందితో బొమ్మై కొత్త టీమ్‌.. యడ్డీ తనయుడికి దక్కని చోటు!

బెంగళూరు: కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బసవరాజ్‌ బొమ్మై ప్రమాణస్వీకారం తర్వాత బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రెండు పర్యాయాలు దిల్లీ పర్యటనకు వెళ్లి భాజపా అధిష్ఠాన పెద్దలతో చర్చించి తర్జనభర్జనల అనంతరం బొమ్మై.. 29 మందితో కొత్త జట్టును ఎంపిక చేశారు. వీరందరితో గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ రాజ్‌భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటల తర్వాత ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త కేబినెట్‌లో యడియూరప్ప తనయుడు విజయేంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఈ జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం.

ప్రమాణస్వీకారానికి ముందు యడియూరప్పని కలిసిన దృశ్యం..

కొత్త మంత్రులు వీరే..

2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పక్కా వ్యూహంతో కొత్త మంత్రుల జాబితాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో గోవింద్‌ కర్జోల్‌, కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌.అశోక‌, బి. శ్రీరాములు, వి.సోమన్న, ఉమేశ్‌ కత్తి, ఎస్‌.అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, సీఎన్‌ అశ్వథ్‌నారాయణ, సీసీ పటేల్‌, ఆనంద్‌ సింగ్‌, కోట శ్రీనివాస పూజారి, ప్రభు చౌహాన్‌, మురుగేశ్ నిరానీ, శివరామ హెబ్బార్‌, ఎస్‌టి సోమేశేఖర్‌, బీసీ పటేల్‌, బీఏ బసవరాజ, డాక్టర్‌ కె.సుధాకర్‌, కె. గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్‌, కేసీ నారాయణ గౌడ, బీసీ నగేశ్‌, వి. సునీల్‌ కుమార్‌, హాలప్ప ఆచార్‌, శంకర పాటిల్‌ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు.

పాత, కొత్త ముఖాల కలయికతో..

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, నడ్డా మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రజలకు ప్రజానుకూల పాలనను అందించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ కేబినెట్‌ను ఎంపిక చేసినట్టు సీఎం బొమ్మై మీడియాకు వెల్లడించారు. అనుభవజ్ఞులతో పాటు కొత్త ముఖాల కలయికతో ఈ కేబినెట్‌ రూపుదిద్దుకున్నట్టు చెప్పారు. మొత్తంగా 29 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు ఆయన ఈ ఉదయం తెలిపారు. 

మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఇలా..

సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో పెద్ద వర్గమైన లింగాయత్‌లకుపెద్ద పీట వేశారు. బొమ్మై జట్టులో ఎనిమిది మంది లింగాయత్‌ వర్గానికి చెందినవారికి కేబినెట్‌లో చోటు కల్పించగా.. ఒక్కళిగల నుంచి ఏడుగురు , ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజికవర్గం నుంచి ముగ్గురు, ఎస్టీ నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, మహిళల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని