Gudivada: గుడివాడలో వైకాపా కవ్వింపు చర్యలు.. ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న తెదేపా-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 18 Jan 2024 13:34 IST

గుడివాడ గ్రామీణం: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా-జనసేన, వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు వస్తున్న తెదేపా-జనసేన కార్యకర్తలు, నాయకులపై వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. గుడివాడ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ వెనిగండ్ల రాము కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో కొంతసేపటికి ఉద్రిక్తత సద్దుమణిగింది.

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా తెదేపా ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి కోరారు. ఉదయం 11.30 గంటలకు పోలీసులు వారికి సమయం ఇచ్చారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నివాళులర్పించేందుకు ఆ పార్టీ నేతలు బయలుదేరారు. ఈ క్రమంలో తెదేపా-జనసేన, వైకాపా  కార్యకర్తలు పరస్పరం ఎదురుపడ్డారు. కొడాలి నాని సమక్షంలోనే వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో తోపులాట జరిగింది. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోవడంతో ఇరువర్గాలు శాంతించాయి. అనంతరం తెదేపా నేతలు ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు.

అంతకుముందు పోలీసులు తెదేపా ర్యాలీని అరగంట అడ్డుకున్నారు. పోలీసులతో వాదనకు దిగి తమకు అనుమతిచ్చిన సమయంలోనే ర్యాలీ నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు పట్టుబట్టారు. కొడాలి నానికి అనుమతి ఇచ్చి.. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని తెదేపా-జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఆ వైఖరిని నిరసిస్తూ వెనిగండ్ల రాము రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు నివాళులర్పించి తీరుతామని తేల్చిచెప్పారు. ఎన్నికల కోసం కొడాలి నాని పన్నే కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

‘‘ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే తిట్టిన కొడాలి నానికి ఆయన పేరు తలచే అర్హత కూడా లేదు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం పాకులాడే వ్యక్తిగా నాని మారారు. గుడివాడలో వైకాపా పనైపోయింది. సాయంత్రం నిర్వహించే ‘రా.. కదలి రా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం తగదు. ఈ ప్రభుత్వం మరో రెండు నెలలు మాత్రమే ఉంటుందని గుర్తించి పోలీసులు పనిచేయాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతం చేసి తీరుతాం’’ అని రాము చెప్పారు. ‘రా.. రా కదలి రా..’ సభ ఏర్పాట్లలో ఉన్న తమ కార్యకర్తలపై దాడి చేసి అడ్డుకోవాలనే కుట్రతో వైకాపా కవ్వింపు చర్యలకు దిగుతోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని