Andhra News: ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా

ఏపీలోని ప్రభుత్వ దుకాణాల్లో లభించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని తెదేపా నాయకులు వెల్లడించారు. రాష్ట్రంలో లభించే మద్యం తాగుతున్న

Updated : 25 Jun 2022 13:53 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ దుకాణాల్లో లభించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని తెదేపా నాయకులు పంచమర్తి అనురాధ, ఆనం వెంకటరమణా రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో లభించే మద్యం తాగుతున్న వారి ఆరోగ్యం దశలవారీగా క్షీణిస్తోందని తెలిపారు. ‘‘వివిధ ప్రాంతాల నుంచి మద్యం సేకరించి టెస్టులు చేయించాం. ఆంధ్రా గోల్డ్‌ విస్కీ, 9సీ హార్స్‌ విస్కీలో కెమికల్‌ కాంపౌండ్స్‌ ఉన్నాయి. వైరాగేలాల్‌, ఐసోఫ్లోరిక్‌ యాసిడ్‌ లాంటివి ఉన్నాయి. మద్యంలో హానికారక కెమికల్‌ కాంపౌండ్స్‌ ఉన్నాయని బహుళ జాతీయ ల్యాబ్‌ నివేదిక ఇచ్చింది’’ అని తెదేపా నాయకులు వెల్లడించారు.

కేసును నీరు గార్చడానికే ఇలాంటి ప్రయత్నాలు

ఏపీలోని ప్రభుత్వ మద్యం వల్ల ప్రాణ హాని లేదంటూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన వివరణ బూటకమన్న తెదేపా నాయకులు రాష్ట్రంలో మద్యం కాదు.. సారాయి ఏరులై పారుతోందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొరుకుతున్న మద్యం తాగితే శరీరం సూదులతో గుచ్చినట్టుగా అవుతోందని చెప్పారు. ‘‘మద్యం దుకాణాల్లో నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. లోడ్‌ లారీ పట్టుకుంటే ఇద్దరు సేల్స్‌మెన్లను అరెస్టు చేశారు. కేసును నీరు గార్చడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని తెదేపా నేతలు విమర్శించారు.

రూ.35 వేల కోట్ల అప్పు తెచ్చింది..

మందుబాబులను కూడా తాకట్టు పెట్టిన సీఎం ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించిన తెదేపా నాయకులు... మద్యంపై ఆదాయాన్ని చూపి వైకాపా ప్రభుత్వం రూ.35 వేల కోట్ల అప్పు తెచ్చిందని చెప్పారు. ‘‘అమరావతి అభివృద్ధికి ఆనాడు తెదేపా ప్రభుత్వం రూ.రెండు వేల కోట్ల బాండ్లు తెస్తే వైకాపా నాయకులు విమర్శించారు. ఇవాళ మద్యంపై ఆదాయం చూపించి రూ. 35 వేల కోట్లు బాండ్లు తెచ్చారు. రూ. 2 వేల కోట్లకే పెద్ద రచ్చ చేసిన వైకాపా నాయకులు ఇప్పుడు రూ. 35 వేల కోట్లకు ఏమంటారు’’ అని పంచమర్తి అనురాధ, ఆనం వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని