AndhraPradesh : నియంతృత్వం వీడి రివర్స్‌ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి: చంద్రబాబు

ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై వైఎస్‌ జగన్ ప్రభుత్వ  తీరు దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు

Published : 03 Feb 2022 15:48 IST

అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలపై వైఎస్‌ జగన్ ప్రభుత్వ  తీరు దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియంతృత్వం వీడి రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలన్నారు. అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని సూచించారు. జగన్‌ సర్కార్‌లా ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చి జీతాలను రికవరీ చేయడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తాము 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని గుర్తు చేశారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్బంధించడం, విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనని పేర్కొన్నారు. మాయమాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని చెబుతూ మళ్లీ మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నారు: లోకేశ్‌

ఉద్యోగుల పట్ల ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ జగన్‌ను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం మాట తప్పిన మీ ప్రభుత్వ తీరుపై శాంతియుతంగా ఉద్యోగులు నిరసన తెలపడం నేరం ఎలా అవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్నవన్నీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల శాంతియుత న్యాయమైన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు నారా లోకేశ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని