AIMIM: ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తు!

వచ్చే ఎన్నికల్లో వంద స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతామని...

Updated : 25 Jul 2021 10:10 IST

సమాజ్‌వాది పార్టీకి ఎంఐఎం షరతు

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాది పార్టీతో ఎంఐఎం షరతులతో కూడిన పొత్తు పెట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో సమాజ్‌వాది ప్రభుత్వం ఏర్పడితే తమ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎంఐఎం షరతు విధించింది. తమ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వచ్చే నెల మొదటి వారంలో యూపీలో పర్యటిస్తారని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పుడే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఒవైసీ ఇప్పటికే మొరాదాబాద్, ఇతర జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. వచ్చే ఎన్నికల్లో వంద స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతామని  ప్రకటించారు. కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ అని.. ఆ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంఐఎం నాయకులు తెలిపారు. భాజపాను ఓడించాలంటే మాత్రం పొత్తు తప్పదని.. ఈ నేపథ్యంలో ఎస్పీతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

రంగంలోకి దిగిన పార్టీలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడే అన్ని పార్టీలు కులాల వారీగా సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బహుజన సమాజ్‌ పార్టీ ‘జ్ఞానోదయ సమ్మేళన్‌’ పేరిట బ్రాహ్మణ సమావేశాలు ప్రారంభించింది. తాజాగా సమాజ్‌వాది పార్టీ సైతం ఇదే తరహా సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.  అవధ్, పూర్వాంచల్‌ ప్రాంతాల్లో ముస్లింలు, వెనుకబడిన వర్గాలను సమీకరించడానికి ప్రణాళిక రూపొందించుకుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని