Bandi Sanjay: బండి సంజయ్‌ దీక్ష భగ్నం.. అరెస్టు చేసిన పోలీసులు

317 జీవోను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు...

Updated : 03 Jan 2022 05:19 IST

కరీంనగర్‌: జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. భాజపా కార్యాలయం లోపల దీక్ష కొనసాగిస్తున్న సంజయ్‌ను.. కార్యాలయ తాళాలు పగలగొట్టి మరీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వాహనంలో జిల్లా మానకొండూరు పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. అయితే పోలీస్‌స్టేషన్‌లోనే బండి సంజయ్‌ జాగరణ దీక్షకు కూర్చున్నారు. 

అరెస్టుకు ముందు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317 జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

పోలీసులపై ఎదురుడాది చేసినందుకు సంజయ్‌పై కేసు: సీపీ 

బండి సంజయ్‌ దీక్షకు సంబంధించి ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించినందుకు అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. పోలీసులపై ఎదురుదాడి చేసినందుకు సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. 

బండి సంజయ్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికం.. ఈటల

ఉద్యోగుల బదిలీల విషయంలో దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడాన్ని భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమన్నారు. బండి సంజయ్, భాజపా కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ చేస్తున్నారని, వారిపై విచక్షణా రహితంగా పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అమానుషమని ఈటల విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఆందోళనను అడ్డుకుంటే ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

సంజయ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా: కిషన్‌ రెడ్డి

జాగరణ దీక్షకు దిగిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన నియంతృత్వం, ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బండి సంజయ్‌ ఎంపీ అని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడు కూడా అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ కార్యాలయ గేట్లను విరగ్గొట్టి లోపలికి వెళ్లడం అప్రజాస్వామికమన్నారు. ఎంపీ అనే కనీస గౌరవం లేకుండా ప్రవర్తించడం తీవ్ర విషయమని కిషన్‌రెడ్డి తెలిపారు. బండి సంజయ్‌ చేస్తోంది ‘జాగరణ’ మాత్రమే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని