Cm jagan: బీసీల లెక్క తేలితేనే ప్రభుత్వాలకు స్పష్టత.. అప్పుడే వారికి న్యాయం చేయగలం: జగన్‌

కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Updated : 23 Nov 2021 15:12 IST

అమరావతి: కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కులగణన ఉపకరిస్తుందని.. నిజమైన నిరుపేదలకు ఇదెంతో ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు. 1931లో చివరిసారిగా కులాలవారీగా జనగణన చేపట్టారని వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే బీసీ జనాభా గణన జరిగింది. ఇప్పటికి 90 సంవత్సరాలు గడిచింది. బీసీల జనాభా గణన ఎందుకు అవసరం అనే విషయాన్ని విస్తారంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌తో జనగణన వాయిదా పడింది. బీసీల లెక్క తేలితేనే ప్రభుత్వాలకు స్పష్టత వస్తుంది. జనగణన లేకపోవడంతోనే బీసీలు వెనుకబడిపోయారు. సామాజికంగా, ఆర్థికంగా బీసీలకు న్యాయం జరగడం లేదు. బీసీల సంఖ్య తెలిస్తేనే వారికి న్యాయం జరుగుతుంది. రెండున్నరేళ్ల పాలనలో బీసీల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం అడుగులు వేసింది. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఓటు వేసిన వారు ఎవరు? ఓటు వేయనివారు ఎవరు? అనే ప్రాతిపదికన గత ప్రభుత్వ పాలనలో బీసీలను విభజించారు. ఓటు వేసినా.. వేయకపోయినా.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనేదే వైకాపా ప్రభుత్వ లక్ష్యం. బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం. వెనుకబడిన వర్గాల హేతుబద్ధమైన డిమాండ్‌ను కేంద్రానికి పంపుతున్నాం. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు నలుగురు సభ్యులను పంపించాం. వారిలో ఇద్దరు బీసీలున్నారు. శాసనసభ స్పీకర్‌ పదవిని కూడా బీసీ వ్యక్తికే కేటాయించాం. తొలిసారి మండలి ఛైర్మన్‌ పదవిని దళితులకు ఇవ్వగలిగాం. శాశ్వత బీసీ కమిషన్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 648 మండలాల్లో వైకాపా గెలుచుకున్నది 635. వాటిలో బీసీలకు 239 అధ్యక్ష పదవులు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి మొత్తంగా 67 శాతం ఇవ్వగలిగాం.

దేశంలో కులాలను అందరూ అంగీకరిస్తున్నాం కానీ జనగణనకు మాత్రం అంగీకారాన్ని తెలిపే పరిస్థితి లేదు. సెన్సెస్ లో కులపరంగా బీసీ గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారం దక్కించుకుంటున్నారని.. ఆర్థికంగా, రాజకీయంగా కొందరిని అడ్డుకుంటున్నారనే భావన ప్రజల్లో ఉంది. విద్య, ఆర్థిక, సామాజిక వెనుకబాటుకు గురైన వారందరిలోనూ ఈ భావన బలంగా ఉంది. కుల ప్రకటనకు సంబంధించిన కాలమ్‌ను పెట్టాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాం. వెనుకబడిన తరగతులను బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అనే విధంగా మార్చేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేసింది. అందుకే ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాం. బీసీలు, లేదా కేంద్ర ప్రభుత్వ పరిభాషలో ఓబీసీల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా కోరుతోంతి’’ అని సీఎం జగన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని