Election Spending: ఎన్నికల ప్రచారం.. తృణమూల్‌ పెట్టిన ఖర్చు రూ.154 కోట్లు!

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ. 154 కోట్లు ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది.

Updated : 03 Oct 2021 20:23 IST

ఎన్నికల సంఘానికి నివేదిక

దిల్లీ: ఈ ఏడాది మార్చి నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి పెట్టిన ఖర్చు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ. 154 కోట్లు ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. కేవలం ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇంత మొత్తంలో ఖర్చు చేసింది. ఇక తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే (DMK) రూ.114 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అంతకుముందు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే (AIADMK) మాత్రం రూ. 57.3కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ రెండు పార్టీలు తమిళనాడుతో పాటు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించాయి.

అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ రూ.84.9 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇక ఆయా రాష్ట్రాల్లో ప్రచారం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు చేసిన ఖర్చులో సీపీఐ చివరి వరుసలో నిలిచింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం సీపీఐ రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపింది. ఎన్నికల ప్రచార ఖర్చుకు సంబంధించి రాజకీయ పార్టీలు అందించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే, దేశంలో ప్రధానపార్టీగా ఉన్న భాజపాకి  ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార ఖర్చుకు సంబంధించిన వివరాలు మాత్రం అందుబాటులో లేవు. ఇదిలాఉంటే, వీటిలో తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందగా.. డీఎంకే, ఏఐఏడీఎంకేలు మాత్రం రాష్ట్ర పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని