
Political News: ‘కాంగ్రెస్ ఇప్పుడు డీప్ ఫ్రీజర్‌లోకి వెళ్లింది’
తృణమూల్ విమర్శలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్నారు. భాజపాకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీచేసి, ప్రధాన విపక్షంగా మారాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తృణమూల్ పార్టీ పత్రిక కూడా ఇదే తరహాలో కథనం రాసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీప్ ఫ్రీజర్‌లోకి వెళ్లిందని ఆ పార్టీ పత్రిక వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది. దాంతో శూన్యత ఏర్పడిందని, దానిని భర్తీ చేసేందుకు విపక్ష పార్టీలన్నీ మమతా బెనర్జీ వైపు చూస్తున్నాయని పేర్కొంది.
మేఘాలయలో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది రాత్రికి రాత్రే తృణమూల్ పార్టీ జెండా కప్పుకున్నారు. ఆ 12 మందిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉన్నారు. గోవాలోనూ కీలక నేతలు మమత పార్టీలో చేరారు. ఇలా పలు రాష్ట్రాల్లో టీఎంసీ విస్తరణ వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆయన కూడా ప్రతిపక్ష కూటమికి రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. విపక్షాల కూటమిలో కాంగ్రెస్ పాత్ర కీలకమే అయినప్పటికీ.. నాయకత్వం మాత్రం ఒక వ్యక్తికి దేవుడిచ్చిన హక్కు కాదని రాహుల్‌ను ఉద్దేశించి నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.