Mamata Banerjee: యూపీఏనా..? అలాంటిదేమీ లేదు..మమత స్టేట్‌మెంట్‌

భాజపాకు ప్రత్యామ్నాయం కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఆమె మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు.

Published : 02 Dec 2021 01:48 IST

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు

ముంబయి: భాజపాకు ప్రత్యామ్నాయం కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఆమె మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. బుధవారం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ముంబయిలో ఆయన నివాసంలో కలుసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి..? యూపీఏ లాంటిదేమీ లేదు’ అని అన్నారు. భాజపాను ఓడించాలంటే ప్రత్యామ్నాయం అవసరమని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామని చెప్పారు. ఈ సమావేశం గురించి శరద్ పవార్ కూడా స్పందించారు. ‘నేను, నా బృందం మమతతో సుదీర్ఘంగా సంభాషించాం. ఒకే ఆలోచనా విధానం ఉన్న శక్తులన్నీ జాతీయ స్థాయిలో కలిసి రావాలని, సమష్టిగా నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఆమె ఉద్దేశం. అంతా కలిసి బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఆలోచన ఈ ఒక్కరోజు కోసం కాదు. ఇది ఎన్నికలను ఉద్దేశించి జరగాలి’ అని పవార్ వ్యాఖ్యానించారు. 

షారుక్ ఖాన్‌ బాధితులుగా మారారు..

భాజపాను విమర్శించే విషయంలో తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఆమె.. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ‘భారతదేశం ప్రజా బలాన్ని ప్రేమిస్తుంది. కండ బలాన్ని కాదు. మనం ఇప్పుడు భాజపా అనే క్రూరమైన అప్రజాస్వామిక పార్టీని ఎదుర్కొంటున్నాం. మనం కలిసుంటే.. మనం గెలుస్తాం. మహేశ్‌ జీ (మహేశ్‌ భట్‌), షారుఖ్ ఖాన్ బాధితులుగా మారారు. మనం గెలవాలంటే.. మనం పోరాడాలి’ అంటూ మమత మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, పశ్చిమ్‌ బెంగాల్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బెంగాల్‌కు చెందిన ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై రాసిన కవిత గురించి ప్రస్తావించారు.

కాంగ్రెస్‌ లేకుండా భాజపాను ఓడించడం ఓ కల
తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ స్పందించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే భాజపాను ఓడించడం తేలికేనంటూ దీదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ లేకుండా భాజపాను ఓడించడం ఓ కలేనన్నారు. భారత రాజకీయాల్లో వాస్తవికత అందరికీ తెలిసిందేనన్న వేణుగోపాల్‌.. కాంగ్రెస్‌ లేకుండా ఎవరైనా భాజపాను ఓడించగలరనేది కేవలం ఓ కల మాత్రమేనని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని