లోక్‌సభలో వైకాపా ఎంపీల ఆందోళన

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై లోక్‌సభలో వైకాపా ఎంపీలు ఆందోళనకు దిగారు.

Updated : 22 Jul 2021 12:51 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై లోక్‌సభలో వైకాపా ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి గెజిట్‌ నోటిఫికేషన్‌, తెలంగాణ విద్యుదుత్పత్తి అంశాలను లేవనెత్తారు.

అవినాశ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణ జల విద్యుదుత్పత్తిని అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్రానికి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. అయినా నేటికీ తెలంగాణ విద్యుదుత్పత్తి ఆపలేదు. దీనివల్ల రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. తెలంగాణ విద్యుదుత్పత్తిని కేంద్రం, కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) అడ్డుకోవాలి. లేకపోతే ఏపీతో పాటు చెన్నైలో నీటికొరత ఏర్పడే ప్రమాదముంది. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోవాలి’’ అన్నారు.  దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు చెప్పారు. జలవివాదంపై కేంద్రం, కేఆర్‌ఎంబీకి ఏపీ నుంచి లేఖలు వచ్చాయన్నారు. దీన్ని పరిశీలించామని.. తాము సూచించినా జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ఆపలేదని చెప్పారు. ఆపాలని మరోసారి ఆ రాష్ట్రానికి చెబుతామన్నారు.  మరోవైపు పోలవరం అంశంపై చర్చకు వైకాపా ఎంపీలు పట్టుబట్టారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని