Congress-TJS: కాంగ్రెస్‌తో దోస్తీ.. ఎన్నికల్లో పోటీకి తెజస దూరం

వచ్చే ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జనసమితి (తెజస) దూరంగా ఉండనుంది. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

Published : 30 Oct 2023 15:08 IST

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జనసమితి (తెజస) దూరంగా ఉండనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లిలోని తెజస కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే తదితరులు కోదండరాంను కలిసి మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కోదండరామ్‌ తన నిర్ణయాన్ని వెల్లడించారు. 

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోదండరామ్‌ మద్దతు కోరామన్నారు. కేసీఆర్‌ నుంచి తెలంగాణ విముక్తికి కలిసి పనిచేయాలని ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్‌-తెజస సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తెజసను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు.తమ ఫోన్లు హ్యాక్‌ చేస్తున్నారని రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌కు సహకరించకుండా తమ బంధువులు, మిత్రులను మంత్రి కేటీఆర్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

కోదండరామ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపామన్నారు. నవతెలంగాణ నిర్మాణ ప్రాతిపదికన మద్దతు తెలిపామని చెప్పారు. ఇరుపార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెజస తరఫున ఆరు అంశాలను కాంగ్రెస్‌ పార్టీ ముందు పెట్టామని చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం, రైతుల భూముల రక్షణ, ప్రజాస్వామ్య పాలన, ఉద్యమకారుల సంక్షేమ కోసం బోర్డు ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాలని కోరామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని