Ts Assembly: కేసీఆర్‌ కిట్‌తో అద్భుత ఫలితాలు: మంత్రి హరీశ్‌రావు

కేసీఆర్ కిట్ అద్భుత ఫలితాలు ఇస్తోందని.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 56శాతం ప్రసవాలు అవుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014 తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు 26 శాతం  మేర పెరిగాయన్నారు....

Published : 11 Mar 2022 16:54 IST

హైదరాబాద్: కేసీఆర్ కిట్ అద్భుత ఫలితాలు ఇస్తోందని.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 56శాతం ప్రసవాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014 తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 26 శాతం మేర పెరిగాయన్నారు. 2017 జూన్ 2 నుంచి ఇప్పటివరకు 10.85 లక్షల కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా, శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తోందని.. ఇందుకోసం రూ.407 కోట్లతో 22 మాతా, శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిలో ఇప్పటికే 16 కేంద్రాల నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు. 2014లో ప్రసూతి మరణాలు (Maternal mortality Rate) 92 ఉండగా ఇప్పుడది 63కి తగ్గిందని.. శిశు మరణాల రేటు (Infant Mortality Rate) సైతం 39 నుంచి 23కు తగ్గినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో పోషకాహార లోపం సమస్యను అధిగమించేందుకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని బడ్జెట్‌లో ప్రవేశ పెట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు హరీశ్‌రావు వివరించారు.

విద్యాయజ్ఞం మొదలైంది: సబితా ఇంద్రారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి పథకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాలల రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని.. పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో తరగతి గదులు, ఇతరత్రా నిర్మాణాలకు దాతల పేర్లు పెడతామని చెప్పారు. విద్యాశాఖలో 21వేల పోస్టులు మంజూరయ్యాయని.. త్వరలోనే భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ధరణి రూపకల్పన సాహసోపేతమైన చర్య: ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో నమోదైన వివరాల ప్రకారమే రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ పద్దుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ రైతులు ఏళ్ల తరబడి తిరగవద్దనే ధరణి తీసుకొచ్చినట్లు చెప్పారు. ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం 66 లక్షల రైతుల వివరాలు పక్కాగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ధరణిలో 1.52 కోట్ల ఎకరాల భూ వివరాలు ఉన్నాయన్నారు. ధరణి రూపకల్పన సాహసోపేతమైన చర్యగా మంత్రి అభివర్ణించారు. గతంలో పాస్‌ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ రెండు, మూడు ఏళ్లు తిరగేవారన్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని నిర్దేశిత ధరల ప్రకారమే రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌ అయిన 15 నిమిషాల్లోనే ఈ-పాస్‌ పుస్తకం.. వారం రోజుల్లోనే కొరియర్‌ ద్వారా పాస్‌ పుస్తకం వస్తుందని ప్రశాంత్‌ రెడ్డి వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని