Uttarakhand polls: ‘పుష్ప’ మేనియా.. రాజ్‌నాథ్ సింగ్‌ నోట పవర్‌ఫుల్‌ డైలాగ్‌

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘పుష్ప’ సినిమాలోని డైలాగ్‌లను అంతే పవర్‌ఫుల్‌గా చెప్పారు. ఉత్తరాఖండ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.......

Published : 09 Feb 2022 01:26 IST

దేహ్రాదూన్‌: దేశంలో ‘పుష్ప’ మేనియా కొనసాగుతోంది. ఎక్కడ చూసిన పుష్ప సినిమాలోని డైలాగ్‌లు, పాటలే వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ చిత్రంలోని డైలాగ్‌లను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి. తాజాగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నోట పుష్ప డైలాగ్‌లు రావడం విశేషం.

ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంగోలీ ఘాట్‌లో భాజపా నిర్వహించిన ర్యాలీలో మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని సీఎం పుష్కర్ సింగ్ ధామీపై ప్రశంసలు కురిపించారు. ధామీ దేనికీ తలవంచని వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పేరును రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఓ సినిమా గురించే చర్చ సాగుతోంది. ఆ చిత్రం పేరు పుష్ప. మన ముఖ్యమంత్రి పేరు పుష్కర్. పుష్కర్‌ పేరు విని కాంగ్రెస్‌ ఆయన్ను పువ్వు అనుకుంటోంది. కానీ కాంగ్రెస్‌కు ఒకటే చెప్పదలుచుకుంటున్నా. పుష్కర్‌ అంటే పువ్వు మాత్రమే కాదు.. నిప్పు కూడా. మన పుష్కర్‌ ధాని ఎక్కడా తగ్గేదే’ అని వ్యాఖ్యానించారు.

ప్రచారాలు, అవగాహనలు కల్పించేందుకు ప్రభుత్వాలు కొత్త పుష్ప డైలాగ్‌లను వాడుతున్నాయి.  కరోనా వైరస్‌పై తాజా సమాచారాన్ని అందించేందుకు '#IndiaFightsCorona @COVIDNewsByMIB' పేరుతో సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విటర్‌ పేజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ట్విటర్‌ ఖాతాలో ఓ మీమ్‌ను పోస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌ తగ్గేదేలే డైలాగ్ చెప్పే స్టిల్‌ను ఎడిట్‌ చేసి నటుడికి మాస్క్‌ పెట్టారు. ‘పుష్ప.. పుష్ప రాజ్‌ తగ్గేదేలే’డైలాగ్‌ను కాస్త మార్చి.. ‘డెల్టా అయినా ఒమిక్రాన్‌ అయినా.. మాస్క్‌ తీసేదేలే’ అని రాసుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కొద్దిరోజుల క్రితం ఎన్నికల సాంగ్‌ను విడుదల చేసింది. అయితే పుష్పలోని ‘శ్రీవల్లి’ పాట ట్యూన్‌ను తీసుకుని యూపీ గొప్పతనాన్ని చెబుతూ ఈ పాటను రూపొందించింది. ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’ పాట మ్యూజిక్‌తో ‘తూ హై గజాబ్‌ యూ, యూపీ; తేరీ కసమ్‌, యూపీ(చాలా అందంగా ఉంటావు, యూపీ..)’ అంటూ వీడియో సాంగ్‌ను రూపొందించింది. రాణీ లక్ష్మీబాయి వంటి గొప్ప వ్యక్తులు పోరాడిన నేల అంటూ.. రాష్ట్రం గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియో సాంగ్‌ను యూపీ కాంగ్రెస్‌ పార్టీ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘ఉత్తరప్రదేశ్‌ వాసులం అయినందుకు గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని