Andhra News: ఉద్యోగ కల్పన కోసమే అభివృద్ధి వికేంద్రీకరణ: విజయసాయి

ఉద్యోగ కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తిరుపతిలో రేపు నిర్వహించనున్న వైకాపా జాబ్‌ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను విజయసాయి పరిశీలించారు.

Updated : 15 Apr 2022 17:24 IST

తిరుపతి: ఉద్యోగ కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తిరుపతిలో రేపు నిర్వహించనున్న వైకాపా జాబ్‌ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను విజయసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జాబ్‌ మేళా ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరికీ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు.  ఇది ఆరంభం మాత్రమేనని .. రాబోయే రోజుల్లో ఇలాంటి జాబ్‌ మేళా తరహాలో  నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి, తలసరి ఆదాయం ఎలా పెంచాలనే దానిపై  ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు.

‘‘75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించాలని చట్టం తెచ్చారు కదా.. దాన్ని మీరు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారా? అని అడగొచ్చు. అందుకే  అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాం. అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. అన్ని జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే జాబ్‌ మేళా నిర్వహిస్తున్నాం. ఇందులో విశాఖపట్నంలో మొదటి సారి నిర్వహించాం. తిరుపతిలో శనివారం మొదటి రోజు జాబ్‌ మేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, రాజంపేట, కడప ...ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆదివారం అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జాబ్‌ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు వైఎస్సార్‌సీసీ జాబ్‌ మేళా డాట్‌ కామ్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. వారికి పార్టీ కార్యాలయంలో ధ్రువీకరణపత్రం ఇస్తారు. అది చూపించిన వారిని ఇంటర్వ్యూలకు యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. కన్‌ఫర్మేషన్‌ మెస్సేజ్‌ తప్పకుండా చూపించాలి. నిరుద్యోగులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంచి సదవకాశం కల్పిస్తోంది. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఘనత వైకాపా అధినేత జగన్‌కే దక్కుతుంది’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని