Yashwant Sinha: నాకు మద్దతు ఇవ్వండి.. మోదీకి యశ్వంత్‌ ఫోన్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ యశ్వంత్‌ సిన్హా శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జేఎంఎం నేత, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌, భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీలకు ఫోన్‌ చేశారు.

Updated : 25 Jun 2022 08:25 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ యశ్వంత్‌ సిన్హా శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జేఎంఎం నేత, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌, భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీలకు ఫోన్‌ చేశారు. నిజానికి తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌లో శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని సిన్హా భావించారు. అయితే సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్ముకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో సొరెన్‌ (ఆయనదీ అదే తెగ) ఉన్నట్లు గమనించిన యశ్వంత్‌.. ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. జేడీఎస్‌ కూడా ముర్ముకు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. సమాజ్‌వాది పార్టీ యశ్వంత్‌ సిన్హాకే మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  

సిన్హాకు జెడ్‌ కేటగిరీ భద్రత

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్‌లోని వీఐపీ రక్షణ విభాగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. సిన్హా దేశవ్యాప్తంగా పర్యటించేటప్పుడు ఈ దళానికి చెందిన 8-10 మంది సాయుధ కమాండోలు విడతలవారీగా ఆయనకు రక్షణగా ఉంటారు. ఈ నెల 27న ఆయన నామినేషన్‌ దాఖలు చేస్తారని భావిస్తున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల రాజధానుల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించనున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు ఇప్పటికే జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని