Galwan Valley clash: చైనా ఇంకా ఎక్కువ మంది సైనికులనే కోల్పోయింది!

భారత్‌-చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో డ్రాగన్‌ చెప్పినదాని కంటే ఎక్కువ నష్టపోయిందని తాజాగా

Updated : 03 Feb 2022 09:33 IST

గల్వాన్‌ ఘర్షణపై ఆస్ట్రేలియన్‌ పత్రిక కథనం


దిల్లీ: భారత్‌-చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో డ్రాగన్‌ చెప్పినదాని కంటే ఎక్కువ నష్టపోయిందని తాజాగా ఆస్ట్రేలియన్‌ పరిశోధనాత్మక వార్తాపత్రిక ఒకటి బుధవారం పేర్కొంది. చీకటిలో వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటుతున్నప్పుడు చాలామంది చైనా సైనికులు మునిగిపోయారని తెలిపింది. నదిలో ఉష్ణోగ్రతలు అప్పటికి ‘సున్నా’ కంటే దిగువన ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు భద్రత కారణాల దృష్ట్యా పేర్లు వెల్లడించని పరిశోధకులు, చైనీస్‌ బ్లాగర్లు అనేక అంశాలను శోధించినట్లు ‘ది క్లాక్సన్‌’ పత్రిక తెలిపింది. ‘గల్వాన్‌ డీకోడెడ్‌’ శీర్షికతో అందించిన కథనంలో వారు చెప్పిన వివరాలను ఉటంకిస్తూ పలు అంశాలను వెల్లడించింది. మృతుల సంఖ్య చైనా చెబుతున్నట్లు నలుగురు సైనికుల కంటే ఎక్కువే ఉంటుందని పేర్కొంది. ఏడాదిపాటు సాగిన తమ పరిశోధనలో చైనా బ్లాగర్లు తదితరులతో విస్తృత చర్చలు జరిపినట్లు వెల్లడించింది.

‘‘నాటి ఘర్షణకు దారితీసిన పరిస్థితులు, చైనా దాస్తున్న అంశాలకు సంబంధించి వాస్తవంగా ఏం జరిగిందన్న విషయమై ఎన్నో నిజాలు ఉన్నాయి’’ అని పేర్కొంది. కాగా తూర్పు లద్దాఖ్‌ సరిహద్దులో 2020 మే 5న రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన తలెత్తింది. గల్వాన్‌ లోయలో జూన్‌ 15న భారత్‌-చైనా సైనికుల మధ్య పెద్దఎత్తున ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. తమ సైనికులు నలుగురు మృతి చెందినట్లు గత ఏడాది ఫిబ్రవరిలో చైనా అధికారికంగా ప్రకటించింది. అయితే చైనా చెబుతున్న కంటే ఇంకా ఎక్కువ మందే చనిపోయి ఉంటారన్న అంచనాలకు తాజాగా ఈ పత్రిక వెల్లడించిన అంశాలు ఊతమిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని