Gannavaram: గరంగరంగా గన్నవరం పంచాయితీ

గన్నవరం వైకాపాలో నెలకొన్న విభేదాల పంచాయితీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వరకు చేరింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ నియోజకవర్గంలోని వైకాపా నేత దుట్టా

Updated : 20 May 2022 11:54 IST

సజ్జల, సీఎంఓ అధికారి సమక్షంలో చర్చ

వంశీతో కలిసి పనిచేయలేనన్న దుట్టా

ఎమ్మెల్యే అక్రమాలంటూ నివేదిక!

ఈనాడు, అమరావతి: గన్నవరం వైకాపాలో నెలకొన్న విభేదాల పంచాయితీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వరకు చేరింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ నియోజకవర్గంలోని వైకాపా నేత దుట్టా రామచంద్రారావు మధ్య కొంతకాలంగా విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. వారిద్దరినీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి గురువారం రాత్రి సీఎంఓకు పిలిపించి మాట్లాడారు. మొదట దుట్టా రామచంద్రారావు, ఆయన అల్లుడు వైకాపా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ శివభారతరెడ్డిలతో మాట్లాడగా.. ఎమ్మెల్యేతో ఇబ్బందులను వారు వివరించారు. నియోజకవర్గంలో అక్రమంగా క్వారీల నిర్వహణ, మట్టి అమ్మకాలను చేయిస్తున్నారంటూ ఒక నివేదికను అందజేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీతో కలిసి పనిచేయలేమని వారు స్పష్టం చేశారు. ‘వంశీ వివరణ కూడా తీసుకున్నాక మళ్లీ మీతో మాట్లాడతాం’ అని సజ్జల చెప్పి పంపారు. తర్వాత ఎమ్మెల్యేతో కాసేపు మాట్లాడారు. దుట్టానే సరైన అభ్యర్థి అని చెబితే.. తాను తప్పుకొనేందుకు సిద్ధమని వంశీ చెప్పినట్లు సమాచారం. అయితే చర్చ పూర్తిగా జరగకముందే సజ్జల హైదరాబాద్‌ వెళ్తుండడంతో సోమవారం మరోసారి కలుద్దాం అని ఎమ్మెల్యేకు చెప్పినట్లు తెలిసింది.

వంశీతో కలిసి పనిచేయం
బయటికొచ్చాక దుట్టా రామచంద్రారావు విలేకరులతో మాట్లాడారు.. ‘ఎమ్మెల్యే వంశీతో కలిసి పని చేయం. వైఎస్‌ కుటుంబానికి ఉడతాభక్తిగా సాయం చేయడమే నాకు తెలుసు, అంతేతప్ప అవమానాలు భరించి ఇంకొకరి వెంట తిరగాల్సిన అవసరం మాకు లేదు. ఆయన వైకాపా కేడర్‌ను తొక్కేస్తూ తన వెంట వచ్చిన వారికే లబ్ధి చేస్తున్నారు. అందువల్లే రెండేళ్లుగా నేను యాక్టివ్‌గా లేను’ అని దుట్టా రామచంద్రారావు తెలిపారు.

చినికి చినికి.. చీరాలవుతోంది!
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ పంచాయితీ ముదురుతోంది. ఈ విషయమై మూడు రోజుల కిందటే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీలో ఒక స్పష్టత తీసుకున్నారని తెలిసింది. ఇది బయటకు రావడంతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ముఖ్యమంత్రిని కలిసి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ గెలిచిన తెదేపా ఎమ్మెల్యే కరణం బలరాం వైకాపాకు మద్దతు తెలపడంలో బాలినేని కీలకభూమిక వహించారనేది బహిరంగమే. బలరాం కొడుకు వెంకటేష్‌ వైకాపాలో చేరారు. ఆ తర్వాత నియోజకవర్గ వైకాపా బాధ్యుడైన ఆమంచికి, కరణంకు మధ్య విభేదాలు పెరిగాయి. ఆమంచిని పర్చూరు నియోజకవర్గానికి పంపాలని అధినాయకత్వం ప్రయత్నించింది. చివరకు మూడు రోజుల కిందటే సీఎంతో ఆమంచి భేటీలో దీనిపై స్పష్టత వచ్చింది. అదేసమయంలో చీరాలలో కూడా పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వాలని సీఎం ఆమంచికి సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చీరాలపై ఆమంచి పెత్తనం కొనసాగనుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే బాలినేని సీఎంను కలిసినట్లు వైకాపావర్గాల్లో చర్చ జరుగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని