తెలంగాణ ప్రాజెక్టులపై సమగ్ర నోట్‌ ఇవ్వండి

గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లపై సమగ్ర వివరాలతో నోట్‌ను అందజేయాలని గోదావరి నదీ యాజమాన్యబోర్డు కేంద్రజలసంఘాన్ని కోరింది. సీతారామ

Updated : 14 Jan 2022 05:34 IST

సీడబ్ల్యూసీని కోరిన గోదావరి బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌ : గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లపై సమగ్ర వివరాలతో నోట్‌ను అందజేయాలని గోదావరి నదీ యాజమాన్యబోర్డు కేంద్రజలసంఘాన్ని కోరింది. సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం డీపీఆర్‌లను కేంద్రజలసంఘాని(సీడబ్ల్యూసీ)కి తెలంగాణ సమర్పించగా, చనాకా-కొరాటా, చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వరం), చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, మోదికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ ప్రాంతీయ కార్యాలయంలో అందజేసింది. ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత చనాకా-కొరాటా, చిన్నకాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌లను గోదావరి బోర్డుకు జలసంఘం పంపింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై నోట్‌ ఇవ్వాలని సీడబ్ల్యూసీని బోర్డు కోరింది. గత నాలుగు రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి నదీ యాజమాన్యబోర్డు కార్యదర్శి కుటియాల సీడబ్ల్యూసీకి లేఖలు రాసినట్లు తెలిసింది.

* చిన్న కాళేశ్వరం కింద నాలుగన్నర టీఎంసీల వినియోగం కాగా, 23,122 హెక్టార్ల ఆయకట్టు ఉంది. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర అంశాలతో పాటు, వర్షాలు లేని సమయంలో పోలవరంపైన, ధ]వళేశ్వరం ఆయకట్టుపైన దీని ప్రభావం పడుతుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొందని, దీన్ని జలసంఘం పరిశీలించి అభిప్రాయం చెప్పాలని బోర్డు కోరింది.

* గోదావరి ట్రైబ్యునల్‌ ప్రకారం ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు కానీ, రాష్ట్రాల వారీగా కానీ లేవని, పునర్విభజన తర్వాత కూడా రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014 జనవరి2న రాసిన లేఖను తెలంగాణ పేర్కొనగా, 2004లో వాప్కోస్‌ నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావించిందని, వీటన్నిటిపై అభిప్రాయాలతో నోట్‌ ఇవ్వాలని బోర్డు కోరింది. చనాకా-కొరాటాకు సంబంధించి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 10.71 టీఎంసీల నీటి లభ్యత బ్యారేజీ వద్ద ఉంది. ఇందులో మహారాష్ట్ర 0.322, తెలంగాణ 1.744 టీఎంసీల వినియోగం పోనూ 8.66 టీఎంసీలు మిగులు ఉన్నట్లు చూపించారని, అయితే సాప్ట్‌ కాపీలో మహారాష్ట్ర వినియోగం 0.672 టీఎంసీలు, తెలంగాణ వినియోగం 2.094 టీఎంసీలు పోనూ 6.464 టీఎంసీల మిగులు ఉందని పేర్కొన్నారని, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎందుకు ఉందో తెలపాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని