రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో కాంగ్రెస్‌ చింతన శిబిరాలు

ఇటీవల ఉదయ్‌పుర్‌ మేధోమథన సదస్సులో తీసుకున్న నిర్ణయాలను దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు చేరవేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో చింతన శిబిరాలను నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి చింతన శిబిరాలు జూన్‌ 1 నుంచి

Published : 19 May 2022 05:21 IST

జూన్‌ 1, 2, 11 తేదీల్లో నిర్వహణ

దిల్లీ: ఇటీవల ఉదయ్‌పుర్‌ మేధోమథన సదస్సులో తీసుకున్న నిర్ణయాలను దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు చేరవేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో చింతన శిబిరాలను నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి చింతన శిబిరాలు జూన్‌ 1 నుంచి 2 వరకు రెండు రోజుల పాటు కొనసాగుతాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా బుధవారం దిల్లీలో తెలిపారు. ఈ సదస్సుల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పదవులకు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొంటారు. జూన్‌ 11న దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తారు. ఆయా చింతన శిబిరాల్లో ‘ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌’ను వివరిస్తారు. పార్టీ నిర్ణయాలను క్షేత్ర స్థాయి వరకు అమలు చేయడం, సంస్థాగతంగా బలోపేతం కావడంపై చర్చిస్తారు. ఆగస్టు 9-15 తేదీల మధ్య పార్టీ జిల్లా యంత్రాంగాలు ‘ఆజాదీ గౌరవ్‌ యాత్ర’లు చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, వారి నుంచి స్ఫూర్తిని పొందేలా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు కార్యక్రమాలను నిర్వహిస్తాయని సుర్జేవాలా వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని