Updated : 25 May 2022 10:53 IST

నాడు సునామీ కోసం.. నేడు చైనా కట్టడి కోసం..

చతుర్భుజ కూటమి ఏర్పాటు ఇలా..

టోక్యో: క్వాడ్‌.. ఈ పేరు వింటేనే ప్రస్తుతం చైనా ఉలిక్కిపడుతోంది. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలతో ఏర్పడిన ఈ కూటమిని తొలుత డ్రాగన్‌..పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు తీవ్రంగా తీసుకుంటోంది. ఆసియా ‘నాటో కూటమి’గా దీన్ని అభివర్ణించిందంటేనే  ఈ కూటమి చైనాను ఎంతగా భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి క్వాడ్‌... చైనాకు వ్యతిరేకంగా ఏర్పడింది కాదు.

ఎందుకు స్థాపించారంటే..
2004లో హిందూ మహాసముద్రంలో సునామీ అల్లకల్లోలం రేపింది. ఆ సమయంలో పరస్పర సహకారం కోసం అమెరికా, జపాన్‌ భారత్‌, ఆస్ట్రేలియా తాత్కాలికంగా కూటమి కట్టాయి. 2007లో నాటి జపాన్‌ ప్రధాని షింజో అబే.. దీనికి క్వాడ్‌ (చతుర్భుజ భద్రతా సంభాషణ) కూటమిగా నామకరణం చేశారు. అయినా పెద్దగా కార్యకలాపాలు నిర్వహించింది లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రభావం పెరగడంతో 2017 నుంచి క్వాడ్‌ క్రియాశీలకమైంది. మాజీ, ప్రసుత అమెరికా అధ్యక్షులు ట్రంప్‌, బైడెన్‌ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. 2021లో తొలిసారి కూటమిలోని దేశాధినేతలు సమావేశమయ్యారు.

ఆసియా నాటోనా..
చైనా.. క్వాడ్‌ను ‘ఆసియా నాటో’గా అభివర్ణించింది. అయితే నాటో సైనిక కూటమికి, క్వాడ్‌కు సంబంధం లేదు. నాటో కూటమిలోని ఒక దేశంపై దాడి జరిగితే సభ్యదేశాలు తమపై దాడి జరిగినట్లే పరిగణిస్తాయి. క్వాడ్‌లో అలాంటి రక్షణ ఒప్పందం ఏమీ లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యం జరిగేలా చూడటంతో పాటు.. ఆర్థిక, దౌత్య, సైనిక అంశాల్లో పరస్పరం సహకారం కోసమే క్వాడ్‌ ఏర్పడింది. చైనా మాత్రం.. తమను కట్టడి చేయడానికే అమెరికా కనుసన్నల్లో ఇది ఏర్పడిందని అంటోంది. అయితే ఎన్నడూ చైనా ప్రభావాన్ని నిరోధించేందుకే.. క్వాడ్‌ను స్థాపించామని కూటమిలోని దేశాలు బహిరంగంగా పేర్కొనలేదు.

నాలుగు దేశాలేనా..
ఇప్పటివరకైతే కూటమిలో నాలుగు దేశాలే ఉన్నాయి. ఇందులో చేరటానికి దక్షిణ కొరియా ఆసక్తిగా ఉంది. అమెరికా మాత్రం క్వాడ్‌ను విస్తరించే ప్రణాళికలు లేవని చెబుతోంది. అయితే క్వాడ్‌ ప్లస్‌ పేరిట ఇటీవల ఓ సమావేశం జరిగింది. దీనికి దక్షిణకొరియా, న్యూజిలాండ్‌, వియత్నాం హాజరయ్యాయి.

సహచర నేతలకు మోదీ అపూర్వ బహుమతులు
క్వాడ్‌లోని తన సహచర నేతలకు టోక్యోలో ప్రధాని మోదీ భారతీయత ఉట్టిపడేలా అపూర్వ బహుమతులు అందజేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో బాగా ప్రాచుర్యమున్న సాంఝీ కళారూపాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆయన బహూకరించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు గోండు కళా పెయింటింగ్‌ను అందించారు. రోగన్‌ పెయింటింగ్‌తో కూడిన చెక్క పెట్టెను జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదకు కానుకగా అందజేశారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts