జరిమానాలు నగదు రూపంలో తీసుకోవద్దు

ఎక్కడంటే అక్కడ సరకు రవాణా వాహనాలను నిలిపివేస్తూ పోలీసులు, ఇతర అధికారులు నిరంతరం బెదిరింపులకు గురి చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Published : 01 Jul 2022 06:34 IST

 రోడ్డు సంకేతాలు హిందీ, ఇంగ్లిషు, స్థానిక భాషల్లో పెట్టండి

డ్రైవర్లకు కనీస సదుపాయాలు, వ్యక్తిగత బీమా ఉండాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిఫార్సు

ఈనాడు, దిల్లీ: ఎక్కడంటే అక్కడ సరకు రవాణా వాహనాలను నిలిపివేస్తూ పోలీసులు, ఇతర అధికారులు నిరంతరం బెదిరింపులకు గురి చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నిర్దేశిత ప్రదేశాల్లోనే సరకు రవాణా వాహనాలను పరిశీలించాలని, ఆ ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అంతరాష్ట్ర చెక్‌ పోస్టుల్లోనూ ఈ ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. ట్రక్కు యజమానులు, డ్రైవర్ల నుంచి పోలీసులు, రవాణా శాఖాధికారులు ఏటా రూ.22,000 కోట్లు వసూలు చేస్తున్నారని 2013లో ఒక సర్వే తేల్చగా, ఇది రూ.48,000 కోట్లు ఉంటుందని 2020లో మరో సర్వే లెక్క కట్టింది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సిఫార్సులు చేసింది. వీటి అమలుపై తీసుకున్న నివేదికలను మూడు నెలల్లో సమర్పించాలని ఆదేశించింది.


ఆన్‌లైన్‌లో సేవలు అందేలా చూడండి

వాహనాల తనిఖీ సమయంలో నిఘా అధికారులు తమ శరీరాలకు కెమెరాలు అమర్చుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. అధికారులను నేరుగా కలుసుకునే అవకాశం తగ్గించడానికి అన్ని రకాల పత్రాలు ఆన్‌లైన్‌లో జారీ అయ్యేలా చూడాలని తెలిపింది. ఇతర సిఫార్సులు..

* జరిమానాలు నగదు రూపంలో తీసుకోకూడదు.

* నిర్దేశిత బరువుకు మించి సరకు రవాణా పరిశీలనకు టోల్‌ బూత్‌లు, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుల వద్ద తూనిక యంత్రాలు ఉండాలి.

* అధిక వేగాన్ని గుర్తించేందుకు రహదారులపై స్పీడ్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

* డ్రైవర్లు, యజమానుల ఫిర్యాదుల స్వీకరణకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.

* రహదారుల పక్కన పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. అక్కడ డ్రైవర్లకు విశ్రాంతి గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మించాలి. తగిన ధరలో ఆహారం లభ్యమయ్యేలా చూడాలి. పూర్తి సదుపాయాలతో ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

* హిందీ, ఇంగ్లిషుతో పాటు స్థానిక భాషల్లో రహదారి సంకేతాలు ఏర్పాటు చేయాలి.

* రూ.15 లక్షలకు తక్కువ కాకుండా డ్రైవర్లు, సహాయకులకు వ్యక్తిగత ప్రమాద బీమా కల్పించాలి.

* ఆన్‌లైన్‌ వాహన్‌ పోర్టల్‌ ద్వారా వారి బీమా పునరుద్ధరణ ఏర్పాట్లను పర్యవేక్షించాలి. వారికి నగదురహిత వైద్య సేవలు అందించాలి. ప్రమాదవశాత్తూ డ్రైవర్‌, సహ డ్రైవర్‌, సహాయకుడు మరణిస్తే పరిహారం పదిహేను రోజుల్లోపు వారి కుటుంబ సభ్యులకు అందేలా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని