రాహుల్‌ వ్యాఖ్యల వక్రీకరణతో వీడియో

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలో కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఉద్దేశపూర్వకంగా తయారుచేసిన కల్పిత వీడియోను కేంద్ర మాజీమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ సహా కొందరు భాజపా నేతలు సామాజిక

Published : 03 Jul 2022 06:39 IST

రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ పోస్టుపై ట్విటర్‌ చురక

భాజపా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలో కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఉద్దేశపూర్వకంగా తయారుచేసిన కల్పిత వీడియోను కేంద్ర మాజీమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ సహా కొందరు భాజపా నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఇందుకు వెంటనే క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘దుష్ప్రచారం, అబద్ధాలే వారి పునాదులు’ అంటూ భాజపా, ఆర్‌.ఎస్‌.ఎస్‌.లపై రాహుల్‌గాంధీ సైతం ధ్వజమెత్తారు. రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ షేర్‌ చేసిన ఫేక్‌ వీడియోను ‘అసందర్భ సమర్పణ’గా ట్విటర్‌ యాజమాన్యం పేర్కొంది. ఇది ‘సిగ్గుచేటు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ భాజపాపై దాడికి దిగింది. శుక్రవారం ఒక వార్తా ఛానల్లో వచ్చిన విద్వేషపూరిత వీడియోను కొందరు భాజపా నేతలు ఉద్దేశపూర్వకంగా షేర్‌ చేశారని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు కాంగ్రెస్‌ కమ్యూనికేషన్ల విభాగం ఇన్‌ఛార్జి జైరాం రమేశ్‌ ఒక లేఖ రాశారు.

రాహుల్‌గాంధీని అప్రదిష్ఠపాలు చేయాలనే..
‘‘వయనాడ్‌లో తన కార్యాలయంపై ఎస్‌.ఎఫ్‌.ఐ. చేసిన దాడి గురించి రాహుల్‌గాంధీ మాట్లాడితే.. దాన్ని ఉదయ్‌పుర్‌లో జరిగిన కన్హయ్యలాల్‌ హత్య గురించి మాట్లాడినట్లు మార్చేశారు. ఎంపీలు రాజ్యవర్ధన్‌ రాథోడ్‌, సుబ్రత్‌ పాఠక్‌, ఎమ్మెల్యే కమలేశ్‌ సైని, ఇంకా పలువురు భాజపా నేతలు ఆ వీడియోను  సరిచూసుకోకుండానే షేర్‌ చేశారు. ఇది తప్పుదోవ పట్టించేలా ఉందని మా పార్టీ సహచరులు హెచ్చరించడంతో రాథోడ్‌ తొలుత డిలీట్‌ చేశారు గానీ.. మళ్లీ దాన్నే అప్‌లోడ్‌ చేశారు’’ అని జైరాం రమేశ్‌ ఆ లేఖలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావాలని చేసినట్లున్న రాథోడ్‌ చర్యలు రాహుల్‌గాంధీని అప్రదిష్ఠపాలు చేయాలన్న భాజపా వ్యూహంలో భాగమేనని, ఇప్పటికే రగులుతున్న మతకల్లోలాలను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని జైరాం రమేశ్‌ ఆరోపించారు. శనివారమే క్షమాపణలు అందకపోతే.. సామాజిక మాధ్యమాలను ఇంత బాధ్యతారహితంగా, నేరపూరితంగా ఉపయోగించినందుకు భాజపాపైన, ఆ పార్టీ నాయకులపైన తగిన చర్యలు తీసుకుంటామని జైరాం రమేశ్‌ హెచ్చరించారు. ఫేక్‌ వీడియోలు షేర్‌ చేసిన భాజపా నాయకులు దేశ పర్యటనకు సిద్ధం కావాలని, పలు నగరాల్లోని కోర్టుల చుట్టూ వాళ్లు తిరగాల్సిందేనని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్ల విభాగాధిపతి పవన్‌ ఖేడా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని